కేంద్రమంత్రి నారాయణ రాణేను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసిన కొద్ది సేపటికే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో మంత్రి.. భోజనం చేస్తుండగానే పోలీసులు ఆయనను అరెస్ట్ చేస్తున్నట్లు ఉంది. ఆ సందర్భంలో పోలీసులకు, భాజపా కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది.


వీడియోలో ఏముంది?






రాణే.. భోజనం చేస్తోన్న సమయంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పలువురు కార్యకర్తలు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కేంద్రమంత్రిపై ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారో తెలపాలని వారు డిమాండ్ చేశారు. ఆ సమయంలో సీనియర్ ముంబయి పోలీసు అధికారులు అక్కడే ఉన్నారు. రాణేను.. తమతో రావాలని పోలీసులు కోరారు.


రత్నగిరి జిల్లా పర్యటనలో ఉండగా కేంద్రమంత్రి రాణేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను సంగమేశ్వర్ పోలీసు స్టేషన్ కు తరలించారు.


రాణేపై నాశిక్ సిటీ శివసేన పార్టీ చీఫ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 500 (పరువు నష్టం). 505(2) (మిస్చీఫ్). 153-B (1) (c) (విద్వేష పూరిత వ్యాఖ్యలు చేయడం) సెక్షన్ల కింద ఎఫ్ఐర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


ఏమన్నారు..?


జన ఆశీర్వాద యాత్రలో భాగంగా కేంద్రమంత్రి రాణే రాయ్ గఢ్ జిల్లాలో సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం ఠాక్రేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.


" ముఖ్యమంత్రికి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందో కూడా తెలియకపోవడం సిగ్గుచేటు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ఠాక్రే.. మధ్యలో వెనక్కి తిరిగి స్వాతంత్యం వచ్చి ఎన్నేళ్లయిందని ఆయన సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆ రోజు నేను అక్కడ ఉంటేనా.. ఆయన చెంప పగలగొట్టేవాడిని.   "




-నారాయణ రాణే, కేంద్రమంత్రి



రాణే వ్యాఖ్యలపై శివసేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా శివసేన కార్యకర్తలు భాజపాకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. నల్లజెండాలతో ఆందోళన చేశారు.


Also Read: Union Minister Arrested: 'చెంపదెబ్బ' వ్యాఖ్యలపై కేంద్రమంత్రి రాణే అరెస్ట్