కేంద్రమంత్రి నారాయణ రాణేను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కారణంగా ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. రత్నగిరి పర్యటనలో ఉన్న ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎంపై ఆయన చేసిన చెంపదెబ్బ వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీశాయి.
తీవ్ర దుమారం..
జన ఆశీర్వాద యాత్రలో భాగంగా కేంద్రమంత్రి రాణే రాయ్ గఢ్ జిల్లాలో సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం ఠాక్రేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
రాణే వ్యాఖ్యలపై శివసేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా శివసేన కార్యకర్తలు భాజపాకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. నల్లజెండాలతో ఆందోళన చేశారు.
హైకోర్టులో చుక్కెదురు..
ఈ వ్యవహారంలో అరెస్టు నుంచి రక్షణ కోరుతూ కేంద్రమంత్రి రాణే ఇప్పటికే బాంబే హైకోర్టును ఆశ్రయించారు. రాణేపై నమోదైన కేసులు కొట్టేయాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరారు. అయితే ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు న్యాయస్థానం అంగీకరించలేదు. అత్యవసర విచారణ కోసం ముందు రిజిస్ట్రీ డిపార్ట్‌మెంట్‌లో దరఖాస్తు చేసుకోవాలని, అప్పుడే తాము పరిశీలిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది.
Also Read:Indian Students US Visa: ఆల్ టైమ్ రికార్డ్.. 55 వేల మంది భారతీయ విద్యార్థులకు యూఎస్ వీసాలు