VP Poll Result: భారత 16వ ఉపరాష్ట్రపతిగా ఘన విజయం సాధించిన జగదీప్ ధన్‌ఖడ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భాజపా చీఫ్ జేపీ నడ్డా ఇలా ప్రముఖులందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
నివాసానికి వెళ్లి
జగ్దీప్ ధన్‌ఖడ్ నివాసానికి వెళ్లి ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. దిల్లీలోని ధన్‌ఖడ్ నివాసానికి మోదీ వెళ్లి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా కూడా ధన్‌ఖడ్ నివాసానికి వెళ్లారు.
భారత రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా ధన్‌ఖడ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.
ధన్‌ఖడ్ కృతజ్ఞతలు
దేశంలోని సాధారణ రైతు కుటుంబం నుంచి జగదీప్ ఈ స్థాయికి ఎదిగారు. ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీ, సహా భాజపా నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
" నా లాంటి సాధారణ వ్యక్తికి ఇంత గొప్ప అవకాశం వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఓ రైతు బిడ్డ ఈ రోజు ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యాడు. ఈ అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీ సహా నాయకత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నాను. "
ఘన విజయం
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో నిలిచిన జగదీప్ ధన్‌ఖడ్ విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వాపై 346 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
- మొత్తం పోలైన ఓట్లు: 725
- జగదీప్ ధన్‌ఖడ్‌కు: 528 ఓట్లు
- మార్గరెట్ అల్వాకు: 182 ఓట్లు
- చెల్లుబాటు కానివి: 15 ఓట్లు
- ఓటుహక్కు వినియోగించుకోనివారు: 55 మంది
ఓటమిని అంగీకరించి
ఉమ్మడి విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మార్గరెట్ అల్వా తన ఓటమిని అంగీకరించారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన జగదీప్ ధన్‌ఖడ్‌కు ఆమె శుభాకాంక్షలు తెలిపారు.
Also Read: Vice President Election 2022: ఉపరాష్ట్రపతి పీఠంపై రైతు బిడ్డ- ఎన్నికల్లో జగదీప్ ధన్‌ఖడ్ విజయం
Also Read: Raksha Bandhan 2022: రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలకు సీఎం గిఫ్ట్