ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉంది. అయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గానికి మార్చి 13న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్‌ పివిజిడి ప్రసాద్‌ రెడ్డి, రిజిస్ట్రార్‌ వి.కృష్ణమోహన్‌ ఆదివారం ఉదయం 9.00 గంటలకు పోలీస్‌ పహారాలో దసపల్లా హోటల్‌ సమావేశ మందిరంలో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్‌కి మద్దతుగా ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో  వైవీ సుబ్బారెడ్డి, వైసీపీ నేతలు పాల్గొన్నారు. 
ఏయూ వీసీ అధికార దుర్వినియోగం చేశారని ఆరోపణలు
ఈ సమావేశం నిర్వహణ బాధ్యతను ఏయూ వీసీ పీవీజీడీ ప్రసాదరెడ్డి తీసుకున్నారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అధికార పదవుల్లో ఉన్నవాళ్లు ఈ విధంగా సమావేశం నిర్వహించడం రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించడమే అవుతుంది. అధికార దుర్వినియోగం ఎన్నికల కోడ్‌ ను ధిక్కరించడమే, చట్టరీత్యా నేరం అని.. తక్షణమే ఏయూ వీసీ, రిజిస్ట్రార్ లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఐటీయూ (Centre of Indian Trade Unions) జిల్లా కమిటీ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరింది. ఈ సమావేశం సమాచారం తెలిసిన వెంటనే ప్రజాసంఘాల నాయకులు జిల్లా ఆర్‌డిఓ, డిఆర్‌ఓలకు సమాచారం అందించినట్లు చెబుతున్నారు. అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వస్తామని తెలపడంతో అక్కడకు చేరుకున్న సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.కె.ఎస్‌.వి.కుమార్‌, జిల్లా నేతలు ఎం సుబ్బారావు, చంద్రశేఖర్‌, విద్యార్ధి, యువజన సంఘం నాయకులను పోలీస్‌లు అక్రమంగా అరెస్టులు చేసి పోలీస్‌ స్టేషన్‌ తరలించడం అన్యాయం అన్నారు.
సీసీ ఫుటేజీ సేకరించి పరిశీలించాలన్న సీఐటీయూ
అధికార పదవులో ఉండి ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన ఏయూ వీసీ, రిజిస్ట్రార్‌లకు పోలీసులు రక్షణగా ఉండటం అధికార దుర్వినియోగమే అవుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇప్పటికే వైఎస్‌ఆర్‌సిపి తన సచివాలయ సిబ్బందిని, వాలంటీర్లను, ఆర్‌పిలను వినియోగిస్తున్నా ఎన్నికల కమిషన్‌ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం సరైందికాదు. వీరందర్నీ ఎన్నికల కమిషన్‌ పరిధిలో తీసుకోవాలని సీఐటీయూ కోరింది. ఈ సమావేశానికి బాధ్యత వహించిన ఏయూ వీసీ పీవీజీడీ ప్రసాదరెడ్డి పైన, రిజిస్ట్రార్‌ వి.కృష్ణమోహన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వైఎస్సార్ సీపీ అభ్యర్థి నామినేషన్ ను తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఏయూ వీసీ, రిజిస్ట్రార్ మీటింగ్‌ నిర్వహించిన మీటింగ్ హాల్ లోని సీసీ పుటేజీలను స్వాధీనం చేసుకుని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. 


ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి అధికారులే పాల్గొనడం సిగ్గుచేటని, సమావేశాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వార్ని అరెస్టు చేయడం దుర్మార్గం అని సీఐటీయూ కార్యదర్శి ఎస్‌.జ్యోతీశ్వరరావు ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి 13న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం విశాఖలో జరిగిన ఓ సమావేశానికి పోలీస్‌ బందోబస్తు మధ్యే అధికారులు హాజరు కావడం బాధాకరం అన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్తి సీతంరాజు సుధాకర్‌కు మద్ధతుగా ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారని, అధికార పదవుల్లో ఉన్నవాళ్లు ఈ విధంగా సమావేశం నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధమని గుర్తు చేశారు. ఆయా అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఐటీయూ జిల్లా కమిటీ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరింది. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.కె.ఎస్‌.వి.కుమార్‌, జిల్లా నాయకులు ఎం.సుబ్బారావు, చంద్రశేఖర్‌, విద్యార్ధి, యువజన సంఘం నాయకుల్ని పోలీస్‌లు అక్రమంగా అరెస్టు చేశారని, నిబంధనలు ఉల్లంఘించిన వారికి పోలీసులు కూడా కొమ్ము కాయడం దుర్మార్గమేనన్నారు.