Viveka Murder Case : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న వాచ్ మెన్ రంగన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. పులివెందులలో చికిత్స పొందుతున్న అతడిని వెంటనే తిరుపతిలోని స్విమ్స్ కు తరలించారు. వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు అక్కడే ఉన్న వాచ్‌మెన్ రంగన్న.. ఎర్ర గంగిరెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి కలిసి వివేకాను హత్య చేశారని కోర్టు ఇచ్చిన 164 స్టేట్ మెంట్‌లో తెలిపిన విషయం తెలిసిందే. వయసు రీత్యా పలు అనారోగ్య సమస్యలు రావడంతో వాచ్ మెన్ రంగన్న ఆరోగ్య పరిస్థితి దెబ్బతింది. ఇంట్లో ఉన్నప్పుడు ఆరోగ్యం విషమించడంతో ఆయన ఇంటి వద్దే ఉన్న సెక్యూరిటీ పోలీసులు, కుటుంబసభ్యులు మంగళవారం పులివెందుల ప్రభుత్వ ఏరియా దవాఖానాకు తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుండి తిరుపతిలోని స్విమ్స్ కు తీసుకెళ్లాలన్న వైద్యుల సూచన మేరకు అంబులెన్స్ లో రంగన్నను తిరుపతికి తరలించారు.
వివేకా పీఏను ప్రశ్నించిన సీబీఐ
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు వివేకా పర్సనల్ అసిస్టెంట్ కృష్ణా రెడ్డిని మంగళవారం ప్రశ్నించారు. హత్యకు ముందు వివేకా రాసిన లేఖను కృష్ణా రెడ్డి దాచిపెట్టిన విషయం తెలిసిందే. అధికారులు ఆ విషయంపైనే ఎక్కువగా ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. పగలు 3 గంటలకు కోఠిలోని సీబీఐ ఆఫీస్ కు వచ్చిన పీఏ కృష్ణారెడ్డిని 5 గంటలకు పైగా ప్రశ్నించారు. హత్య జరిగిన ప్రాంతంలో లభించిన కీలక ఆధారమైన ఆ లెటర్ ను ఎందుకు దాయాల్సి వచ్చిందో, అలా దాయమని ఎవరు చెప్పారో చెప్పాంటూ కృష్ణా రెడ్డిని ప్రశ్నించినట్లు సమాచారం. ఆ లెటర్ ను మొదట ఎవరు గుర్తించారు, ఆ లెటర్ గురించి మీకెలా తెలిసింది, తర్వాత దాన్ని ఎక్కడ దాచి పెట్టారు, మీ వద్ద లెటర్ ఉన్నట్లు ఇంకా ఎవరితో అయినా చెప్పారా, లెటర్ ను పోలీసులకు ఎన్ని గంటల తర్వాత అప్పగించారు, అప్పటి వరకు లెటర్ ను దాయాల్సిన అవసరం ఏంటి అంటూ అనేక ప్రశ్నలను సీబీఐ అధికారులు సంధించినట్లు తెలుస్తోంది. అయితే అధికారుల ప్రశ్నలకు పీఏ కృష్ణారెడ్డి ముక్తసరిగా సమాధానాలు ఇచ్చినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి.
గతంలో సంచలన కామెంట్స్ చేసిన కృష్ణారెడ్డి
కృష్ణారెడ్డి ఓ టీవీఛానల్‌తో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. వివేకానందరెడ్డి చనిపోయారని సునీత, రాజశేఖర్ రెడ్డికి ఫోన్ చేస్తే... ఏం జరిగింది ఎలా జరిగిందో అని ఆరా తీయకుండా ఓకే అని ఫోన్ పెట్టేశారన్నారు. ఆ రోజు ఉదయం ఐదున్నరకు వివేకా ఇంటికి వెళ్లానని అన్నారు. అక్కడే ఉన్న ముందు గేట్ ఓపెన్ అయి ఉందని... అది గమనించి లోపలికి వెళ్లానని అన్నారు. అప్పటికీ వివేకా లేవలేదని తెలిపారు. పడుకున్నారేమో అని మళ్లీ నేను బయటకు వచ్చేశానని... ఆయన భార్య సౌభాగ్యకు ఫోన్ చేశానని తెలిపారు. నైట్ లేట్‌గా వచ్చారని ఇంకా కాసేపు పడుకోనిలే అన్నారని వివరించారు. ఇంతలో వంట మనిషి వచ్చినట్టు చెప్పారు.
కాసేపు వెయిట్ చేసినా ఆయన ఇంకా లేవలేదు. మళ్లీ లేపలేదు ఎందుకని తిడతారని వెనుక నుంచి వెళ్లి పిలిచామన్నారు. లోపల పడిపోయినట్లు తెలియడంతో లోపలికి వెళ్లి చూస్తే రక్తంతో నిండిపోయింది. బాత్రూమ్‌లోకి వెళ్లి చూస్తే వివేక పడిపోయి ఉన్నారు. నాడి చూసి చనిపోయినట్టు గుర్తించామన్నారు. బయటకు వచ్చి నర్రెడ్డి రాజేశేఖర్‌కు ఫోన్ చేశామన్నారు. ఆహా అని చెప్పి ఫోన్ పెట్టేశారని అన్నారు.