Vivek Ramaswamy:


రేసులో ఉన్నానంటూ ప్రకటన..


అమెరికాలో భారత సంతతికి చెందిన వాళ్లెందరో రాజకీయాల్లో రాణిస్తున్నారు. కొందరు ఎంపీలు అయ్యారు. బ్రిటన్‌కు ప్రధాని అయిన రిషి సునాక్‌ భారతీయుడే. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా భారత సంతతికి చెందిన వారే. ఇప్పుడీ లిస్ట్‌లో మరో వ్యక్తి చేరారు. 
భారత మూలాలున్న అమెరికన్ మల్టీ మిలియనీర్, రచయిత వివేక్ రామస్వామి (Vivek Ramaswamy)...2024లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడం ఎంతో గర్వంగా ఉందంటూ వెల్లడించారు. Fox Newsకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు వివేక్ రామస్వామి. అమెరికాను అన్ని విధాలుగా ఉత్తమంగా తీర్చి దిద్దాల్సిన అవసరముందని అన్నారు. రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. ఇప్పటికే ఆ పార్టీ తరపున నిక్కీ హేలీ అధ్యక్ష (Presidential Race) పదవి రేసులో ఉన్నారు. 


"అమెరికాను మరోసారి ఉత్తమ దేశంగా తీర్చి  దిద్దాల్సిన అవసరముంది. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కాదు.. అమెరికాలోని భవిష్యత్ తరాల కలలను దృష్టిలో పెట్టుకుని ఈ ఉద్యమం చేపట్టాలి. మన రంగుని బట్టి కాదు గుణాన్ని బట్టి అవకాశాలు రావాలి. మన మెరిట్‌కు ప్రాధాన్యత దక్కాలి. ప్రస్తుతం సంక్షోభంలో ఉన్నాం. ఇప్పుడు అమెరికన్లలో ఎవరినైనా 'దేశం ఎలా ఉందని' ప్రశ్నిస్తే ఏ సమాధానమూ ఇవ్వలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరేం సాధించగలరో ఓ సారి ఆలోచించండి. అందుకు అనుగుణంగా ముందుకెళ్లండి"


-వివేక్ రామస్వామి


ఇదీ బ్యాక్‌గ్రౌండ్‌..


37 ఏళ్ల వివేక్ రామస్వామి బయోటెక్నాలజీలో ఎక్స్‌పర్ట్. అంతే కాదు. Woke, Inc.: Inside Corporate America’s Social Justice Scam అనే పుస్తకం రాశారు. నిజానికి...ఆయనకు పేరు తెచ్చి పెట్టింది ఈ పుస్తకమే. 2021 ఆగస్టులో పబ్లిష్ అయిన ఈ బుక్‌ సంచలనం సృష్టించింది. అమెరికాలో బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. దీంతో పాటు మరో పుస్తకమూ రాశారు వివేక్. అది కూడా ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టింది. వివేక్ తల్లిదండ్రులు కేరళ నుంచి అమెరికాకు వలస వెళ్లారు. ఓహియోలో స్థిరపడ్డారు. వివేక్ బాల్యమంతా అక్కడే గడిచింది. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి బయాలజీలో బ్యాచ్‌లర్ డిగ్రీ చేశారు. యేల్ లా స్కూల్‌లో లా చదువుకున్నారు. ఓహియోలోని జ‌న‌ర‌ల్ ఎల‌క్ట్రిక్ ప్లాంట్‌లో ప‌ని చేసిన ఆయన...ఆ తరవాతే వ్యాపారం వైపు కదిలారు. 2014లో రోయివాంట్ సైన్సెస్ సంస్థ‌ను ఏర్పాటు చేశారు వివేక్. ఎన్నో వ్యాధుల‌కు ఈ ఫార్మ‌సీ కంపెనీ మందుల్ని త‌యారు చేస్తోంది. ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన ఆ ఉత్ప‌త్తుల‌కు మార్కెట్లో మంచి డిమాండ్‌తో పాటు గుర్తింపు కూడా ఉంది. రోయివాంట్‌తో పాటు మ‌రికొన్ని హెల్త్‌కేర్, టెక్నాల‌జీ కంపెనీల‌నూ స్థాపించారు. 2022లో Strive Asset Management సంస్థను ప్రారంభించారు. ప్రజల్లో రాజకీయాల పట్ల అవగాహన కల్పించడం సహా...వాళ్ల గొంతుకను వినిపించడమే లక్ష్యంగా ఈ కంపెనీ పెట్టారు వివేక్ రామస్వామి. 2016లో అమెరికాలోనే 40 ఏళ్ల లోపు అత్యంత సంపన్నమైన వ్యాపారుల్లో 24వ వ్యక్తిగా నిలిచారు. అప్పటికే ఆయన సంపద 600 మిలియన్ డాలర్లుగా ఉంది. 


Also Read: Rahul Gandhi:పెళ్లి చేసుకోవాలని పిల్లలు కావాలని ఉండేది, సింగిల్‌గా ఎందుకున్నానో నాకే తెలియదు - రాహుల్ గాంధీ