గట్టిగా హత్తుకుని, గుక్కపట్టి ఏడ్చి..


స్కూల్‌ డేస్‌లోనైనా, కాలేజ్‌ డేస్‌లోనైనా ఫేర్‌వెల్ పార్టీ రోజు విద్యార్థులందరూ ఎమోషనల్ అయిపోతారు. అప్పటి వరకూ గొడవలు పడ్డ వాళ్లు
కూడా అంతా మర్చిపోతారు. గురువులకు వీడ్కోలు పలికే సమయంలో స్టూడెంట్స్ భావోద్వేగానికి లోనవుతారు. వెళ్లిపోవద్దంటూ గట్టిగా హత్తుకుని ఏడ్చేస్తారు. ఇలాంటి ఘటనలు గతంలో ఎన్నో జరిగాయి. ఆ వీడియోలూ అప్పట్లో నెట్టింట వైరల్ అయ్యాయి. ఇప్పుడిలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. చందౌలిలోని రాయ్‌గర్ ప్రైమరీ స్కూల్‌లో నాలుగేళ్లుగా పని చేస్తున్న శివేంద్ర సింగ్ ఈ మధ్యే వేరే చోటకు బదిలీ అయ్యారు. చివరి సారి స్కూల్‌కి వచ్చి వెళ్లిపోయే సమయంలో పిల్లలు ఆయన వెంట పడ్డారు. వెళ్లొద్దు మాష్టారూ అంటూ గట్టిగా హత్తుకున్నారు. కొందరు బాలికలు ఆయనను పట్టుకుని ఏడ్చారు. పిల్లలు ఇలా ఎమోషనల్ అవ్వటాన్నిచూసి ఆ టీచర్‌కు ఏం చేయాలో అర్థం కాలేదు. నవ్వుతూనే, కన్నీళ్లు పెట్టుకున్నాడు. అంతకు ముంది పిల్లలంతా కలిసి ఆయనకు గిఫ్ట్‌లు ఇచ్చారు. "త్వరలోనే మళ్లీ వస్తాను" అని ఓదార్చే ప్రయత్నం చేసినా పిల్లలు ఏడుపు ఆపలేదు. "బాగా చదువుకోవాలి" అని పిల్లలకు చెబుతూనే ముందుకు నడిచారు.





 బాధగా ఉంది..కానీ తప్పదు కదా..


శివేంద్ర సింగ్ అందరి టీచర్లలా కాకుండా, పిల్లలకు అర్థమయ్యే విధంగా కొత్త కొత్త పద్ధతుల్లో పాఠాలు చెప్పేవారని స్కూల్ యాజమాన్యం చెబుతోంది. ఈ మెథడ్స్‌తోనే పిల్లల్లో చదువు పట్ల ఆసక్తి పెంచారని అంటోంది. 2018లో అసిస్టెంట్ టీచర్‌గా విధుల్లో చేరారు శివేంద్ర సింగ్. ఆటలు, సోషల్ మీడియా సాయంతో పిల్లలు చురుగ్గా ఉండేలా చేశారు. పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఇది హిల్‌స్టేషన్ కావటం వల్ల చాలా మంది పిల్లలు, ఇక్కడికి రావటానికీ ఇబ్బందులు పడేవారు. కానీ..ఎప్పుడైతే శివేంద్ర సింగ్ వచ్చాడో అప్పటి నుంచి స్కూల్‌లో అడ్మిషన్స్ పెరిగాయి. గ్రౌండ్‌లో కూర్చుని చుట్టూ పిల్లలను కూర్చోబెట్టుకుని పాఠాలు చెప్పేవారు. "ఈ కొండల్లోనే పిల్లలతో కలిసి క్రికెట్ ఆడాను. ఈ ప్రపంచాన్ని కొత్త కోణంలో చూపించేందుకు నా వంతు ప్రయత్నం నేను చేశాను. ఈ పిల్లల్ని వదిలి వెళ్లటం చాలా బాధగా ఉంది. కానీ తప్పదు కదా" అని అన్నారు శివేంద్ర సింగ్. జులై మొదటి వారంలో కశ్మీర్‌లోనూ ఇదే విధంగా జరిగింది. ఎన్నో ఏళ్లుగా పాఠాలు చెప్పిన మాష్టారు ఉన్నట్టుండి వెళ్లిపోవటాన్ని తట్టుకోలేక పిల్లలందరూ గుక్కపట్టి ఏడ్చారు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది.