Watch Video:


ఘజియాబాద్‌లో..


ఘజియాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో ముగ్గురు చిన్నారులు ఇరుక్కుపోయి అరగంట పాటు నరకం అనుభవించారు. ఈ ముగ్గురూ 10 ఏళ్ల లోపు బాలికలే. 20 వ అంతస్తు నుంచి కిందకు వస్తుండగా...11 వ అంతస్తు వద్ద ఒక్కసారిగా లిఫ్ట్ ఆగిపోయింది. లిఫ్ట్‌లోని సీసీటీవీలో ఈ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. ముగ్గురు చిన్నారులు భయంతో వణికిపోతూ కనిపించారు. గట్టిగా అరుస్తూ ఏడ్చారు. ఒకరిని ఒకరు ఓదార్చు కున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏడ్చి ఊరుకోకుండా...లిఫ్ట్ గేట్ తీసేందుకు గట్టిగానే ప్రయత్నించారు. దాదాపు అరగంట పాటు అలా లిఫ్ట్‌లో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. తరవాత అపార్ట్‌మెంట్ వాసులు వచ్చి వాళ్లను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఓ చిన్నారి తండ్రి మెయింటేనెన్స్‌ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ కంప్లెయింట్ ఇచ్చారు. "మేం 20వ అంతస్తులో ఉంటాం. మా 8 ఏళ్ల పాప తన ఫ్రెండ్స్‌తో కలిసి లిఫ్ట్ ఎక్కింది. కింద పార్క్‌లో ఆడుకునేందుకు ముగ్గురూ వెళ్లారు. ఉన్నట్టుండి 11వ ఫ్లోర్‌లో లిఫ్ట్ ఆగిపోయింది. లైట్స్ ఆన్ అయ్యాయి" అని చిన్నారి తండ్రి చెప్పారు. ఒకటిన్నర నిముషం పాటు ఉన్న ఈ వీడియోలో ఆ చిన్నారులు బయటకు రావడానికి పడిన కష్టమంతా కనిపిస్తోంది. ఓ చిన్నారి గేట్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా...మిగతా ఇద్దరు చేతులు జోడించి దేవుడికిప్రార్థించారు. మెయింటేనెన్స్ టీమ్‌ అప్రమత్తమై వారిని బయటకు తీసుకొచ్చారు. "వాళ్ల చాలా నెర్వస్ ఫీల్ అయ్యారు. లిఫ్ట్ నుంచి బయటకు వచ్చాక కూడా వాళ్లు ఏడుపు ఆపలేదు. ఇంకెప్పుడూ లిఫ్ట్ ఎక్కనని చాలా భయపడిపోతూ చెబుతున్నారు. మిగతా పిల్లలు కూడా లిఫ్ట్ అంటేనే భయపడుతున్నారు" అని అపార్ట్‌మెంట్ వాసులు చెబుతున్నారు. 






ముంబయిలో...


ఈ మధ్య కాలంలో లిఫ్ట్ ప్రమాదాలు ఎక్కువై పోయాయి. పనుల్లో నిర్లక్ష్యం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా నిర్లక్ష్యం మాత్రం మారడం లేదు. రోజూ దేశంలో ఏదో ఒక చోట లిఫ్ట్ ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. బాధితులు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. మొన్న గుజరాత్ లో లిఫ్ట్ కూలడంతో ఏడుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయిన విషయం మరచిపోక ముందే ముంబయిలో మరో ప్రమాదం జరిగింది. లిఫ్ట్ డోరులో ఇరుక్కుని ఓ టీచర్ ప్రాణాలు కోల్పోయింది. ఇటీవల ముంబయిలోని శివారు ప్రాంతం అయిన మలాడ్ చించోలి బందర్ లోని సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ హైస్కూల్ లో ఈ ప్రమాదం జరిగింది. జెనెల్ ఫెర్నాండెజ్ అనే 26 ఏళ్ల టీచర్ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రెండో అంతస్తులోని స్టాఫ్ రూమ్ కు వెళ్లేందుకు ఆరో అంతస్తులో వేచి ఉంది. లిఫ్ట్ లో రెండో అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్ బటన్ నొక్కగానే లిఫ్ట్ తను ఉన్న ఫ్లోర్ కు వచ్చి ఆగింది. ఎప్పట్లాగే ఆమె లిఫ్ట్ లో రెండో ఫ్లోర్ లోని స్టాఫ్ రూమ్ కు వెళ్లాలనుకుంది. కానీ అనుకోని ప్రమాదం ఆమె ప్రాణాలను తీసింది. ఆమె లిఫ్ట్ లోకి పూర్తిగా వెళ్లక ముందే లిఫ్ట్ తలుపు ఆటోమేటిక్ గా మూసుకున్నాయి. అంతలోనే లిఫ్ట్ కిందకు వెళ్లింది. అలా జెనెలె ఫెర్నాండెజ్ లిఫ్ట్ తలుపుల మధ్యలోనే అలాగే ఉండిపోగా.. పాఠశాల సిబ్బంది ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. పరుగెత్తుకు వచ్చి లిఫ్ఠ్ డోర్ మధ్యలో ఇరుక్కున్న జెనెలె ఫెర్నాండెజ్ ను బయటకు లాగేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆ టీచర్ తీవ్ర గాయాలపాలైంది. 


Also Read: Viral Video: రెచ్చిపోయిన ఆకతాయిలు- కొరియన్ యువతిని వేధించి, కిస్ చేసి!