Sri Krishna Temple: ఆ ఆలయం చూడడానికి చాలా  మామూలుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ దాని విశిష్టత తెలిస్తే మీరు నోరెళ్లబెడతారు. భారతదేశంలోని దక్షిణం వైపు కొలువు దీరిన అష్ట భార్యా సమేత శ్రీకృష్ణుడి విగ్రహాలు ఉన్న ఆలయం కరీంనగర్ లోని రామడుగులో ఉంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయం కొద్ది కాలం పాటు మరుగున పడగా తిరిగి భక్తులు ఆలయ పూజారుల చొరవతో  దీప ధూప నైవేద్యాలను అందుకుంటోంది.




సెలయేటి ఒడ్డున పురాతన ఆలయంలో..


సాక్షాత్తు శ్రీ రామ చంద్రస్వామి అడుగు పెట్టిన చోటు... త్రేతాయుగంలో అరణ్యవాసంలో భాగంగా శ్రీరాముడు కాలు పెట్టిన చోటుగా రామడుగు మండలానికి ఓ ప్రత్యేకత ఉంది. కరీంనగర్ జిల్లా కేంద్రానికి సుమారు 20 కిలో మీటర్ల దూరంలో రామడుగు మండల కేంద్రం జగిత్యాలకు వెళ్లేదారిలో వెదిర నుంచి కుడివైపు 10 కిలోమీటర్లు వెళ్లగానే ఉంటుంది. అక్కడే ఒక సెలయేరు ప్రత్యక్షం అవుతుంది. దానికి ఎడమ వైపున సెలయేటి ఒడ్డున పురాతన ఆలయం దర్శనం ఇస్తుంది. ప్రధాన రహదారికి సమీపంలో భాగంగా ఎడమ వైపున దక్షిణాభి ముఖంగా వెలిసిన శాపురం వేణు గోపాలుడు అష్ట భామలతో దర్శనం ఇస్తాడు. వెయ్యి సంవత్సరాలకు పూర్వం ఈ ఆలయం వెలిసి ఉంటుందని భావిస్తున్నారు. ఇలా 8 మంది భార్యలతో కొలువుదీరి కనిపించే వేణుగోపాల వేణుగోపాల స్వామి ఆలయం దేశంలో మరి ఇక్కడ లేదని పండితులు చెబుతున్నారు. 


ఆలయం చిన్నదే అయినా విశిష్టత మాత్రం చాలా గొప్పది..


గుడి సమీపంలో మట్టితో నిర్మించిన ఆలయ పూజారుల నివాసాలు ఉండేవి. సాక్షాత్తు సూర్య దేవుడే స్వామి వారిని మోస్తున్నట్టు అద్భుతంగా తీర్చిదిద్దిన పల్లకి అత్యంత విలువైన పంచలోహ ఉత్సవ మూర్తులు ఉండేవని, దొంగలు పడి మొత్తం దోచుకెళ్లారని స్థానికులు చెబుతున్నారు. కాలక్రమంలో గుడి శిథిలావస్థకు చేరుకుంది. దీప ధూప నైవేద్యాలకు దూరం అయింది. ఎంతో పురాన ప్రాశస్త్యం కలిగిన ఒక క్షేత్రం ఇలా మరుగున పడిపోవడం గ్రామస్థులకు బాధ కలిగించింది. ఆలయం చిన్నదే అయినప్పటికీ నిర్మాణంలో ప్రాచీన సాంప్రదాయం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. గర్భగుడి ద్వారానికి ఇరు వైపులా స్వామి ద్వారపాలకులైన జయ విజయులు ఉన్నారు. సింహద్వారం ఎదురుగా గరుడాళ్ వారు ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకులై వేశారు.


ఎన్నో ఏళ్ల నుంచి నిలిచిపోయిన ఉత్సవాలు.. ఈసారి మాత్రం!


స్వామివారి వెనుక భాగంలో అశ్వత వృక్షం ఉండటం మరో ప్రత్యేకత. అశ్వత నారాయణుడు సంతానాన్ని ప్రసాదించే దేవుడు కావడంతో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. సుదర్శనం వెంకట స్వామి ఆచార్య సొంత ఖర్చులతో పంచలోహ విగ్రహాలను చేయించారు. ఎన్నో సంవత్సరాల నుంచి నిలిచిపోయిన స్వామివారి ఉత్సవాలను ఈ సంవత్సరం ప్రముఖ జ్యోతిష్య వాస్తు ఆగమ శాస్త్ర పండితులు నమిలకొండ రమణాచార్యుల చేతుల మీదుగా తిరిగి ప్రారంభించారు. రుక్మిణి గోదాసహిత వేణుగోపాల స్వామి ఉత్సవమూర్తులు ప్రతిష్టాపన కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ఆలయాన్ని దర్శించడం అంటే శ్రీకృష్ణ లీలలను గుర్తు చేసుకున్నట్టే.