Thieves Steals Goods from Moving Truck: సినిమాల్లో యాక్షన్ సీన్స్ వస్తుంటే..."అయ్య బాబోయ్ ఇలాంటివి ఎలా తీస్తారో ఏమో" అని నోరెళ్లబెట్టేస్తాం. అచ్చం అలాంటివే మన కళ్ల ముందే నిజంగా జరిగితే ఇక మర్చిపోతామా..? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోని కూడా అలాగే గుర్తు పెట్టేసుకుంటాం. ఆ రేంజ్‌లో ఉంది ఈ స్టంట్. పైగా ఇదేదో సీన్ కాదు. నిజంగా జరిగింది. వేగంగా వెళ్తున్న ట్రక్‌ని బైక్‌పై వెంబడించి ఆ ట్రక్‌పైకి ఎక్కి గూడ్స్‌ని దొంగిలించాడో వ్యక్తి. వెనక వస్తున్న ఓ వ్యక్తి ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇంకేముంది. క్షణాల్లో వైరల్ అయిపోయింది. అసలు అంత గుండెధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. హైలైట్ ఏంటంటే...అంత స్పీడ్‌గా వెళ్తున్న ట్రక్ నుంచి చాలా ఒడుపుగా దిగి బైక్‌పై కూర్చున్నాడు. ఈ స్టంట్ చూసే అంతా ఆశ్చర్యపోతున్నారు. తన వెనక ఇంత సీన్ జరుగుతోందని ఆ ట్రక్ డ్రైవర్‌కి మాత్రం తెలియదు. ఆగ్రా-ముంబయి హైవేలో ఈ స్టంట్‌లు చేశారు దొంగలు.
ఎలా చోరీ చేశారంటే..?
ఓ ట్రక్‌పై ఇద్దరు దొంగలున్నారు. ట్రక్‌లో ఉన్న గూడ్స్‌ని కిందకు పడేశారు. వెనకాలే ఓ బైక్‌పై మరో దొంద వెంబడించాడు. సరుకుని కింద పడేయగానే బైక్ స్పీడ్ పెంచాడు. ట్రక్‌కి దగ్గరగా పోనిచ్చాడు. చాలా చాకచక్యంగా ఓ దొంగ ట్రక్ నుంచి కిందకు దిగుతూ వచ్చాడు. సరిగ్గా బైక్‌పైనే కూర్చున్నాడు. బైక్ నడుపుతున్న వ్యక్తి దిగిన వ్యక్తికి సాయం చేశాడు. ఆ తరవాత మరో దొంగ కూడా ఇదే విధంగా ఒడుపుగా కిందకు దిగాడు. సరిగ్గా బైక్‌పై కూర్చునేందుకు మిగతా ఇద్దరు వ్యక్తులు సాయం చేశారు. ముగ్గురూ బైక్‌పై కూర్చోగానే వెంటనే దారి మళ్లించారు. ఈ ఘటనపై తమకు పూర్తి వివరాలు అందలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ చోరీ తరవాత హైవేలపై సెక్యూరిటీ గురించి చర్చ జరుగుతోంది. అంత సులువుగా దొంగతనం చేసుకుని పోతే పోలీసులు పట్టించుకోవడం లేదని కొందరు నెటిజన్‌లు మండిపడుతున్నారు. ఈ వాదనల సంగతి పక్కన పెడితే ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.