Viral Video: జైపూర్‌లోని అమేర్ ఫోర్ట్‌లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళా రష్యన్ టూరిస్ట్‌పై ఏనుగు దాడి చేసింది. తొండంతో పట్టుకుని గాల్లో అటూ ఇటూ తిప్పింది. ఆ తరవాత నేలకేసి గట్టిగా కొట్టింది. ఫిబ్రవరి 13న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దాడిలో ఆ మహిళా టూరిస్ట్‌కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన జరిగిన వెంటనే...Amer Fort సిబ్బంది వెంటనే అప్రమత్తమైంది. ఈ దాడికి పాల్పడిన ఆడ ఏనుగుని అక్కడి నుంచి పంపించింది. అయితే...అక్కడి సీసీ కెమెరాలో ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. తొండంతో పట్టుకుని నేలకు గట్టిగా కొట్టిన విజువల్స్ వెన్నులో వణుకు పుట్టించాయి. మావటి కూడా ఆ ఏనుగుని నియంత్రించలేకపోయాడు. బాధితురాలిని వెంటనే స్వామి మన్ సింగ్ హాస్పిటల్‌కి తరలించారు. జంతువుల హక్కుల సంఘం (PETA) ఈ ఘటనపై స్పందించింది. ఈ వీడియోని X వేదికగా షేర్ చేసింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మతో పాటు డిప్యుటీ సీఎం దియా కుమారి, రాష్ట్ర అటవీ శాఖ అకౌంట్స్‌ని ట్యాగ్ చేసింది. వెంటనే ఏనుగుని వైల్డ్ లైఫ్ సాంక్చువరీకి తరలించాలని కోరింది. ఈ గౌరి అనే ఏనుగు గతంలోనూ ఇలానే దాడి చేసింది. 2023 అక్టోబర్‌లో స్థానిక దుకాణాదారుడిపై దాడి చేసి గాయపరిచింది.