Football Player Beaten: కేరళలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పశ్చిమాఫ్రికాలోని  Ivory Coast కి చెందిన ఫుట్‌బాలర్‌పై మూకదాడి జరిగింది. కేరళలోని మలప్పురం జిల్లాలో ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఇలా దాడి చేశారు. దాడి చేయడంతో పాటు దారుణంగా దూషించారని చెప్పాడు ఫుట్‌బాలర్. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  బ్లూ టీషర్ట్‌లో ఉన్న ఫుట్‌బాల్ ప్లేయర్‌ Dairrassouba Hassane Junior పై చుట్టూ ఉన్న వాళ్లు మూకదాడి చేశారు. అతను పరిగెడుతున్నా వెంటపడి మరీ కొట్టారు. తప్పించుకుని వెళ్తున్నా మళ్లీ మళ్లీ పట్టుకుని దాడి చేశారు. అయితే...స్థానికులు మాత్రం ఫుట్‌బాలర్‌పైనే ఆరోపణలు చేస్తున్నారు. తమలో ఒకరిని కావాలనే కాలితో తన్నాడని, అందుకే దాడి చేశామని చెబుతున్నారు. అంతా దాడి చేస్తుంటే ఆ ఫుట్‌బాల్ ప్లేయర్‌ని మరో వ్యక్తి కాపాడేందుకు ప్రయత్నించాడు. చాలా సేపు ప్రయత్నించి చివరకు ఆ మూక దాడి నుంచి అతడిని తప్పించాడు. వెంటనే ఆ ఫుట్‌బాల్ ప్లేయర్ ఓ గేట్‌లో నుంచి బయటకు పారిపోయాడు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫుట్‌ బాల్ ఆడుతున్న సమయంలో కొంతమంది స్థానికులు తనని తీవ్రంగా దూషించారని, జాతి పేరుతో బూతులు తిట్టారని కంప్లెయింట్‌లో ప్రస్తావించాడు. కొంతమంది తనపై రాళ్లు కూడా విసిరారని చెప్పాడు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుపై విచారణ జరుపుతున్నారు.