Viral Pic:



ఒక్కో కంపెనీకి ఒక్కో నంబర్..


దేశవ్యాప్తంగా రైడ్‌ సర్వీస్‌లు అందుబాటులోకి వచ్చాక అందరూ వాటికి అలవాటు పడిపోయారు. కాస్త దూరానికి కూడా ఆటోనో, బైక్‌నో బుక్ చేసుకుంటున్నారు. ఓలా, ర్యాపిడో,ఊబర్‌తో చాలా మంది డ్రైవర్‌లు టైఅప్ అవుతున్నారు. ఒక్కొక్కరూ రెండు మూడు కంపెనీలకు సర్వీస్‌లు అందిస్తున్నారు. ఒక కంపెనీ రైడ్‌ను పూర్తి చేసిన వెంటనే..మరో కంపెనీకి సంబంధించిన రైడ్‌ను తీసుకుంటున్నారు. సాధారణంగా ఏ వెహికిల్‌ని అయినా క్యాబ్‌ కంపెనీలతో టై అప్ చేసినప్పుడు వెహికిల్ నంబర్ రిజిస్టర్ అయిపోతుంది. కానీ కొందరు రకరకాల నంబర్లతో రిజిస్ట్రేషన్‌లు చేయించుకుంటున్నారు. బెంగళూరులో ఓ ఆటో వెనక మూడు రిజిస్ట్రేషన్ నంబర్‌లు కనిపించింది. ఓ వ్యక్తి ఈ ఆటోను ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది కాస్తా వైరల్ అయింది. అసలు ఒక్క వాహనానికి ఇలా మూడు నంబర్‌లు వేరువేరుగా ఉండొచ్చా అని ప్రశ్నిస్తున్నారు. ఆటోకి ఎల్లో నంబర్‌ ప్లేట్‌ ఉంది. ఆ డ్రైవర్ మాత్రం ఓలా, ర్యాపిడోకి వేరు వేరు నంబర్‌లు ఉన్నాయంటూ ఓ స్టికర్ అంటించుకున్నాడు. ఇదే హాట్ టాపిక్‌గా మారింది. "ఇన్ని రిజిస్ట్రేషన్‌లా" అంటూ ఓ నెటిజన్‌ ఈ ఫోటోని ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ఓలా, ర్యాపిడోకి టెంపరరీ రిజిస్ట్రేషన్‌ నంబర్‌లు అటాచ్ చేశాడు డ్రైవర్. దీనిపై ట్విటర్‌లో పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతోంది. 






నెటిజన్ల ట్వీట్‌లు..


"నాకూ ఇదే డౌట్ వచ్చింది. చాలా సార్లు నేను వెహికిల్ బుక్ చేసుకుంటే యాప్‌లో ఓ నంబర్ కనిపిస్తుంది. కానీ వచ్చిన వెహికిల్ నంబర్ మాత్రం వేరుగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల సేఫ్‌టీకి గ్యారెంటీ లేకుండా పోతోంది. ఏదైనా క్రైమ్ జరిగితే పోలీసులు ఎలా ట్రాక్ చేస్తారు..?" అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. అయితే దీనిపై ఓలా స్పందించింది. ఈ సమస్యను కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చింది. అయినా RTO ఇచ్చిన నంబర్‌ కాకుండా ఇలా టెంపరరీ నంబర్లు పెట్టుకోవడం లీగల్‌గా కరెక్టేనా..? అని మరి కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇలా ఎంత మంది సర్వీస్‌లు నడుపుతున్నారో లెక్కే లేదంటూ మరి కొందరు ట్వీట్‌లు చేస్తున్నారు. మొత్తానికి ఈ ఒక్క ఫోటో సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది.