A man Dies after blast near RDO office in Anantapur: అనంతపురం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆర్డీఓ ఆఫీసు సమీపంలో పేలుడు సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పేలుడు ధాటికి ఒక వ్యక్తి ముక్కలు ముక్కలు అయి దుర్మరణం చెందడంతో విషాదం నెలకొంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.


అనంతపురం జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ ఆఫీసు సమీపంలో కెమికల్ డబ్బా ఒక్కసారిగా పేలిపోయింది. పేలుడు ధాటికి ఓ వ్యక్తి దాదాపు 30 అడుగుల దూరం ఎగిరిపడి దుర్మరణం చెందాడని సమాచారం. బ్లూ కలర్ లో ఉన్న ఓ కెమికల్ డబ్బా తెరిచే ప్రయత్నం చేస్తుండగా భారీ శబ్ధంతో పేలుడు సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. స్ప్రే పెయింట్ కోసం ఆ వ్యక్తి డబ్బాను తెరవాలని చూశాడని తెలిపారు. అయితే పేలుడు ధాటికి ముక్కలు ముక్కలు కావడంతో డెడ్ బాడీ ఎవరిదో గుర్తుపట్టలేనట్లుగా మారిపోయింది. మరణించిన వ్యక్తిని సతీష్ అని స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అనుకోకుండా పేలుడు సంభవించిందా, లేక ఉద్దేశపూర్వకంగా ఎవరైనా పేలుడు పదార్థాలు పెట్టారా అనే కోణంలో వివరాలు ఆరా తీస్తున్నారు.


పోలీసులు ఏమన్నారంటే..
అనంతపురం వన్ టౌన్ సీఐ కెమికల్ డబ్బా పేలుడు ఘటనపై స్పందించారు. పేలుడు జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. దాదాపు 10 ఏళ్ల కిందట ఇస్మాయిల్ అనే వ్యక్తి పెయింట్ తయారుచేస్తుండేవాడు. అయితే బిజినెస్ సరిగా జరగపోవడమో, లేక ఇతరత్రా కారణాల వల్ల పెయింట్ తయారు చేస్తున్న గోడౌన్ ని మూసివేశారు. ఖాళీగా ఉంచడం ఎందుకు వేరే వాళ్లకు అద్దెకు ఇవ్వాలనుకున్నారు. ఈ క్రమంలో గత రెండు రోజులగా పెయింట్ తయారీ గోడౌన్ క్లీనింగ్ పనులు జరుగుతున్నాయి. అయితే డ్రమ్ములో ఉన్న పెయింట్ ను కింద పారబోస్తే ఖాళీ డ్రమ్ములను సులువుగా తీసుకెళ్లవచ్చునని భావించాడు. ఓ డ్రమ్ము ఓపెన్ చేసే ప్రయత్నం చేయగా ఒక్కసారిగా పేలిపోయిందని సీఐ తెలిపారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ టీమ్ కు సమాచారం అందించామని, వాళ్లు వచ్చి ఆధారాలు సేకరిస్తారని చెప్పారు. అందులో ఏం కెమికల్ ఉందో తెలియదని, విచారణ తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.