తప్పని పరిస్థితుల్లో దొంగలుగా మారుతున్నారు కొందరు. తమ అవసరాలు తీరేందుకు, జల్సాలకు డబ్బుల కోసం చోరీలు చేస్తుంటారు మరికొందరు. కొన్ని సందర్భాలలో దొంగలు తాము చేసిన పనిని నిజాయితీగా ఒప్పుకుంటారు. అందులో మీకు కావాల్సిన ఏమైనా ఉంటే చెప్పండి, వెంటనే పంపిస్తానని వివరణ ఇచ్చుకుంటారు. ఇలాంటి ఘటనలు నెటిజన్లకు నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా అలాంటి చోరీ వివరాలిలా ఉన్నాయి. అది చూసి నెటిజన్లు ఒక్కో తీరుగా స్పందిస్తున్నారు.
ఆర్థిక సమస్యల్లో ఉన్న దొంగ ఓ వ్యక్తి ల్యాప్ టాప్ చోరీ చేశాడు. తన ల్యాప్ టాప్ పోయిందని బాధ పడుతున్న వ్యక్తికి చోరుడు ఊహించని షాకిచ్చాడు. నన్ను క్షమించండి, నేను మీ ల్యాప్ టాప్ ఎత్తుకెళ్లాను అంటూ ఓ దొంగ సదరు లాప్ టాప్ యజమానికి తాపీగా ఈమెయిల్ చేశాడు. తాను ఆర్థిక సమస్యలో ఉన్నానని, ఏం చేయాలో తోచక మీ ల్యాప్ టాప్ చోరీ చేయాల్సి వచ్చింది అని తన పరిస్థితిని వివరించాడు. జ్వెల్లీ థిక్సో అనే ట్విట్టర్ యూజర్ ఈ వివరాలను తన ఖాతాలో పోస్ట్ చేయగా విషయం వైరల్ అవుతోంది.
తన మెయిల్ ఐడీ నుంచి ఈమెయిల్..
తొలుత తన మెయిల్ ఐడీ నుంచి ఈమెయిల్ రావడంతో ల్యాప్ టాప్ పోగొట్టుకున్న వ్యక్తి షాకయ్యాడు. ఆపై తనకు వచ్చిన మెయిల్ వివరాలు చెక్ చేసి నవ్వాలో, బాధ పడాలో అర్థం కాలేదు. ల్యాప్ టాప్ లో వివరాలు చెక్ చేసిన దొంగ.. కీలక సమాచారమైన పరిశోధన పత్రాలను దాని ఓనర్ కు పంపించాడు. ఇంకా ఏమైనా ముఖ్యమైన ఫైల్స్ ఉంటే ఇప్పుడే చెప్పండి పంపించేస్తా అన్నాడు. అందుకు దొంగ ఆ ల్యాప్ టాప్ ఓనర్ కు టైమ్ కూడా ఇచ్చాడు. ముఖ్యమైన వివరాలు కావాలంటే సోమవారం 12 గంటల లోగా చెప్పాలని, ఆ తరువాత ల్యాప్ టాప్ తన వద్ద ఉండదని క్లారిటీ కూడా ఇవ్వడం నెటిజన్లకు నవ్వు తెప్పించింది. అయితే ముఖ్యమైన ఫైల్స్ తనకు మిస్ కాకుండా పంపించినందుకు సంతోషించాలో, ల్యాప్ టాప్ పోగొట్టుకున్నందుకు బాధ పడాలో అర్థం కాలేదని దాని ఓనర్ చెబుతున్నాడు. మీ ల్యాప్ టాప్ చోరీ చేసినందుకు క్షమించండి అని మెయిల్ చేశాడు.
నెటిజన్ల ఫన్నీ రియాక్షన్స్..
ఎత్తుకెళ్తే ఎత్తుకెళ్లాడు కాడు కాస్త కామన్ సెన్స్ ఉన్న దొంగేనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మీకు ఎంతో ముఖ్యమైన రీసెర్చ్ పేపర్లు తిరిగి మీకు షేర్ చేశాడు. పైగా ఇంకేమైనా కావాలంటే చెప్పాలని, తిరిగి ఆ వివరాలు షేర్ చేస్తానని చెప్పడాన్ని కొందరు నెటిజన్లు మెచ్చుకున్నాడు. ఇతడు నిజాయితీగా క్షమాపణలు కోరిన మంచి దొంగ అంటూ ట్విట్టర్ లో కామెంట్ చేస్తున్నారు.