Viral News : కాలం మారుతోంది. సోషల్ మీడియా రాజ్యమేలుతోంది. క్రియేటివిటీ కొత్త పుంతలు తొక్కుతోంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు.. ప్రపంచం చేతుల్లోకి వచ్చేసినట్టే. సోషల్ మీడియా పుణ్యమా అని... ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతుంది. ఇందులో రీల్స్‌ది కూడా ప్రధాన భూమికే. వైరటీ వైరటీగా రీల్స్ చేయడం.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. ఇదో ట్రెండ్. ఆ రీల్స్‌కు వచ్చే లైకులు... పెరిగే ఫాలోవర్లు.. వారికి మంచి గుర్తింపును తెచ్చిపెడుతున్నాయి. దీంతో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల సంఖ్య కూడా రోజురోజుకూ పెరిగిపోతోంది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండటం.. కొత్త కొత్త రీల్స్‌లో ఫాలోవర్లను పెంచుకోవడమే కాదు.. ఉన్నవాళ్లను నిలుపుకోవడం కాస్త కష్టమే. దీంతో... రీల్సే జీవితంగా బతికేస్తున్నారు చాలా మంది. ఈ పిచ్చి ఏ స్థాయికి వెళ్లిందంటే... సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఉన్న ఓ యువతి... తనకు కాబోయే మొగుడు రీల్స్ కూడా చేయాలని కండిషన్ పెట్టేంతగా. వినడానికే వింతగా ఉన్నా... ఆమె ఇచ్చిన ప్రకటన ఇప్పుడు వైరల్‌గా మారింది. అంతేకాదు... ఆ యువతి వరుడు కోసం పెట్టిన కండిషన్స్ చూసి... అందరూ ఆశ్చర్యపోతున్నారు.
వరుడు కమ్ రీల్స్ పార్ట్‌నర్ కోసం వినూత్న ప్రకటన ఇచ్చిన ఆ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పేరు రియా. తన పేరు రియా అని... తాను తన జీవిత భాగస్వామి మరియు రీల్ భాగస్వామి కోసం వెతుకుతున్నానని ఆమె ప్రకటన ఇచ్చింది. అందులో కొన్ని కండిషన్స్ కూడా పెట్టింది. అబ్బాయి కెమెరా చూసి సిగ్గుపడకూదట. అంతేకాదు.. తనతో కలిసి రిలేషన్ షిప్ రీల్స్ చేయాలని కూడా ఆమె స్పష్టంగా చెప్పేసింది. అంతేకాదు... మోయి-మోయి వంటి ట్రెండింగ్ మ్యూజిక్‌లో రీల్స్ చేయడంలో అనుభవం కూడా ఉండాలని ఈ ప్రకటనలో తెలిపింది. ఈ కండిషన్స్ చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయా..? ఇవే కాదు... ఇంకా కొన్ని షరతులు కూడా పెట్టింది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రియా.
అబ్బాయిది ఉమ్మడి కుటుంబం అయ్యి ఉండకూదని ప్రకటనలో తెలియజేసింది రియా. అంతేనా... తనను సంప్రదించే ముందు... అబ్బాయి అమెజాన్ మినీ టీవీలో ఉన్న హాఫ్ లవ్ అరేంజ్డ్ ప్రోగ్రామ్‌ని తప్పకుండా చూడాలట. అతనికి ప్రీమియర్ ప్రో గురించి తెలుసుండాలని.. రీల్స్, వ్లాగ్‌లను హ్యాండిల్ చేయగలిగి ఉండాలని ప్రకటన ఇచ్చింది. వరుడి కోసం ఇచ్చిన ప్రకటనలో.. వింత కండిషన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇవేం కండిషన్స్ అంటూ నోరెళ్లబెడుతున్నారు.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రియా ఇచ్చిన ఈ వెరైటీ మ్యాట్రియోనియల్ యాడ్ వైరల్ కావడంతో... అబ్బాయిల నుంచి రియాక్షన్స్ వస్తున్నాయి. కొందరు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ఆ అమ్మాయికి భర్త కావాలా... ఎడిటర్ కావాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు రియా ప్రకటన చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇవేం షరతులు అంటూ నివ్వెరపోతున్నారు. ఏం చేస్తాం... సోషల్ మీడియా యుగం అని సరిపెట్టుకుంటున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో... ఇంకెన్ని వింతలు చూడాలో ఏమో అని.. చెవులు కొరుక్కుంటున్నారు.