West Bengal: లోక్‌సభ ఎన్నికల చివరి విడత పోలింగ్ కొనసాగుతోంది. మిగతా ప్రాంతాల్లో ప్రశాంతంగానే ఉన్నా...ఎప్పటిలాగే బెంగాల్‌లో హింసాత్మక ఘనటలు చోటు చేసుకుంటున్నాయి. కుల్తలిలోని పోలింగ్ స్టేషన్‌లపై కొందరు మూకదాడి చేశారు. ఈవీఎమ్‌లు ఎత్తుకుపోయారు. పోలింగ్‌ బూత్‌కి దగ్గర్లో ఉన్న చెరువులో ఓ ఈవీఎమ్‌ని విసిరేశారు. ఫలితంగా పోలింగ్ నిలిచిపోయింది. ఒక్కసారిగా స్థానికంగా అలజడి రేగింది. భానగర్‌లోని సతులియా ప్రాంతంలోనూ ఇదే తరహా ఉద్రిక్తతలు కొనసాగాయి. సీపీఐ, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్‌ కార్యకర్తలపై కొందరు దాడి చేశారంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఈ అల్లర్లలో ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్‌ కార్యకర్తలు కొందరు గాయపడ్డారు. నాటు బాంబులతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. 






ఈ ఘటనలపై వెస్ట్ బెంగాల్ ఎన్నికల అధికారి స్పందించారు. కొందరు ఆందోళనకారులు వచ్చి బూత్‌పై దాడి చేశారని, ఈవీఎమ్‌ని చెరువులో పడేశారని అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఓ ఆరు పోలింగ్ బూత్‌లలో మాత్రం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని వివరించారు. వెస్ట్‌బెంగాల్‌లో 9 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది.