Vijayawada News: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈనెల 15వ తేదీన విజయవాడ నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను దారి మళ్లిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె రాణా ఆదివారం రోజు వెల్లడించారు. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్న దృష్ట్యా బెంజి సర్కిల్ నుంచి ఆర్టీసీ వై జంక్షన్ వరకు ఎంజీ రోడ్డులో, రెడ్ సర్కిల్ నుంచి ఆర్టీఏ జంక్షన్ వరకు, శిఖామణి సెంటర్ నుంచి వెటర్నరీ జంక్షన్ వరకు కేవలం ఆహ్వానితుల వాహనాలను మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. ఈ మార్గంలో ప్రయాణించాల్సి ఆర్టీసీ సిటీ బస్సులు, ఇతర వాహనాలు ఆర్టీసీ వై జంక్షన్ ఏలూరు రోడ్డు పుష్పా హోటల్, సిద్దార్థ జంక్షన్ మీదుగా, ఆర్టీసీ వై జంక్షన్, బందరు లాకులు, రాఘవయ్య పార్కు, పాత ఫైర్ స్టేషన్ రోడ్డు, అమెరికన్ ఆస్పత్రి, నేతాజీ బ్రిడ్జి, గీతా నగర్, స్క్యూ బ్రిడ్జి మీదుగా బబెంజి సర్కిల్ కు రాకపోకలు సాగించాలన్నారు.
- ఏఏ పాస్ లు కల్గిన వారు మూడో నంబర్ గేట్ నుంచి స్టేడియంలోకి ప్రవేశించి నిర్దేశించిన ప్రదేశంలో వాహనాలు పార్కింగ్ చేసుకోవాలి.
- ఏ1, ఏ2 పాస్ లు కల్గిన వారు నాల్గో గేటు నుంచి ప్రవేశించి హ్యాండ్ బాల్ కోర్టులో వాహనాలు పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
- బీ1, బీ2 పాస్ లు కల్గిన వారు పురస్కార గ్రహీతలు వారి కుటుంబ సభ్యులు రెండో నంబర్ గేు నుంచి ప్రవేశించి ఫుట్ బాల్ కోర్టులో, స్టేడియం ఎదురుగా ఉన్న సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ గ్రౌండ్ లో పార్కింగ్ చేసుకోవాలి.
- పాస్ లు కల్గిన వారిని 7.45 గంటల లోపు మాత్రమే అనుమతిస్తారు.
హైదరాబాద్ లోనూ ఆంక్షలు
స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గోల్కొండ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించి.. రూట్ మ్యాప్ కూడా ఇచ్చారు. ఆగస్టు 15వ తేదీ రోజు మంగళవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగబోతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. వేడుకలకు వచ్చేవారు రావాల్సిన మార్గాలు, పార్కింగ్ ప్రాంతాలపై రూట్ మ్యాప్ ఇచ్చారు. స్వాతంత్ర దినోత్సవం కోసం రాణిమహల్ లాన్స్ నుంచి గోల్కొండ కోట వరకూ ఉన్న రోడ్డును మూసేశారు. వేడుకలకు హాజరయ్యే ప్రముఖులు, అధికారులకు పాసులు అందజేయనున్నారు. ముఖ్యంగా ఏ గోల్డ్, ఏ పింక్, బీ నీలం పాసులు ఇవ్వబోతున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్ , బంజారాహిల్స్, మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం వైపు నుంచి గోల్డ్, ఏ పింక్, ఏ నీలం పాసులు ఉన్న వారిని గోల్కొండ కోట వరకు అనుమతించనున్నారు. ఏ గోల్డ్ పాసులు ఉన్న వారు వాహనాలను పోర్టు మెయిన్ గేట్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై ఫతేదర్వాజా రోడ్డు వైపు పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.