టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న పరభాషా నటులలో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ఒకరు. 'ఓకే బంగారం' సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న దుల్కర్.. 'మహానటి' వంటి బ్లాక్ బస్టర్ మూవీతో నేరుగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. 'కనులు కనులను దోచాయంటే' 'కురూప్' చిత్రాలతో అలరించారు. గతేడాది 'సీతా రామం' సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించారు. ఈ క్రమంలో ఇప్పుడు ‘కింగ్‌ ఆఫ్‌ కోత’ అనే చిత్రంతో రాబోతున్నారు. 


అభిలాష్ జోషి దర్శకత్వంలో దుల్కర్‌ సల్మాన్ నటిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ ‘కింగ్‌ ఆఫ్‌ కోత’. ఇందులో ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్ గా నటిస్తోంది. జీ స్టూడియోస్, వేఫేరర్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని ఆగస్టు 24న థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో అన్ని ప్రధాన భారతీయ భాషల్లో విడుదల చేయనున్నారు. దుల్కర్‌ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని తెలుగు వెర్షన్ ప్రమోషన్స్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ నేషనల్ వైడ్ ట్రెండింగ్ లో ఉండగా.. ఆదివారం హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. 


'కింగ్‌ ఆఫ్‌ కోత' ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు హ్యాండ్సమ్ హల్క్ రానా దగ్గుబాటి, నేచురల్ స్టార్ నాని ముఖ్య అతిధులుగా హాజరై చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ అందజేశారు. ఈ సందర్భంగా దుల్కర్‌ సల్మాన్ తెలుగులో మాట్లాడుతూ.. ఇక్కడి ప్రేక్షకులు, ఇండస్ట్రీలోని అందరూ తనపై ఎంతో ప్రేమ చూపించారని అన్నారు. ‘కింగ్‌ ఆఫ్‌ కోత’ అనేది టీం అందరికీ డ్రీమ్ ప్రాజెక్ట్ అని, తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫిల్మ్ అవుతుందని పేర్కొన్నారు. ''ఇది నేను బలంగా నమ్మి చేసిన గ్యాంగ్ స్టార్ డ్రామా. మీరంతా ఈ చిత్రాన్ని మెచ్చుకొని పెద్ద హిట్ కాదు బ్లాక్ బస్టర్ హిట్ చేస్తారని ఆశిస్తున్నాను. నేను ఇష్టపడే హీరో నానికి చాలా థాంక్స్. నాని నటిస్తున్న ‘హాయ్ నాన్న’ కోసం నేను ఎదురుచూస్తున్నాను. నా చిరకాల మిత్రుడు రానా. నేను తనని 'చీఫ్' అని పిలుస్తాను'' అని దుల్కర్ తెలిపారు. 


''థాంక్యూ హైదరాబాద్.. మీ అందరి ప్రేమకు కృతజ్ఞతలు. మీరు భాషలకు అతీతంగా అన్ని చిత్రాలని ఆదరిస్తున్నారు. ‘కింగ్‌ ఆఫ్‌ కోత’ కూడా మీకు తప్పకుండా నచ్చాలని కోరుకుంటున్నాను. ఐశ్వర్య, అనిఖా.. ఇంకా ఈ చిత్రంలో భాగమైన అందరికీ థాంక్స్. డైరెక్టర్ అభిలాష్ జోషికి ఇది ఫస్ట్ సినిమా అయినప్పటికీ, ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జేక్స్ బిజోయ్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. నేను ఈ చిత్రం కోసం నాలుగు భాషల్లో డబ్బింగ్ చెప్పాను. తెలుగులో నా వాయిసే వుంటుంది. డబ్బింగ్ చాలా బాగా వచ్చింది. ఆగస్ట్ 24 న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల చేస్తున్నాం. ఇది నా బిగ్గెస్ట్ ఫిల్మ్. ఈ మూవీలో డ్యాన్స్, ఫైట్స్, సాంగ్స్, ఫుట్ బాల్, ఎమోషన్స్ అన్నీ వుంటాయి. గ్యాంగ్ స్టార్ డ్రామా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. ఆగస్ట్ 24న థియేటర్స్ లో కలుద్దాం'' అని దుల్కర్‌ సల్మాన్ అన్నారు. 


హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ మాట్లాడుతూ.. దుల్కర్‌ సల్మాన్, నాని, రానా లాంటి ఇండియన్ సినిమా గేమ్ చేంజర్స్ తో కలసి ఈ వేదిక పంచుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రేక్షకులు, అభిమానులు వారికి పంచిన ప్రేమలో తనకు కూడా కొంచెం ఇవ్వాని కోరుకుంటున్నానని నవ్వుతూ అన్నారు. 'కింగ్‌ ఆఫ్‌ కోత' మీ అందరికీ నచ్చుతుందని పేర్కొన్నారు. ఈ ఈవెంట్ లో నిర్మాత శ్రవంతి రవి కిషోర్, నిమ్మకాయల ప్రసాద్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.


Also Read: ‘రోలెక్స్‌’ రాబోతున్నాడు.. క్లారిటీ ఇచ్చేసిన సూర్య! 



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial