Vijay mallya Podcast: ఇండియా నుంచి పారిపోయిన తొమ్మిదేళ్ల తర్వాత విజయ్ మల్యా  నోరు విప్పారు.  తప్పించుకున్నానే కానీ.. తప్పుడు మనిషిని కాను అంటున్నారు. భారత్‌లో ప్రజలు తనను ఓ దొంగలా చూస్తున్నారని ఆవేదన చెందారు. తాను నష్టాల పాలవ్వడానికి అప్పటి ప్రభుత్వమే కారణమన్నాడు.  ప్రఖ్యాత పాడ్ కాస్టర్ రాజ్ షమని Raj Shamani తో దాదాపు 4 గంటలపాటు జరిగిన ఇంటర్వూలో మాల్యా తన వ్యాపార సామ్రాజ్య పతనం దగ్గర నుంచి బ్యాంకులు తన నుంచి ఎంత లాక్కున్నాయో వరకూ చాలా విషయాలపై మాట్లాడారు.

కింగ్ ఫిషర్  మునిగింది.. ప్రభుత్వమే కారణం.

ఇండియాకు లగ్జరీ ఎయిర్‌లైన్స్ తీసుకొచ్చిన ఘనత మాల్యాది. 2005 లో స్టార్ట్ చేసిన కింగ్ ఫిషర్ ఏడేళ్ల కంటే ఎక్కువ  కాలం మనుగడ సాగించలేదు. 2008లో ఈ లగ్జరీ ఎయిర్‌లైన్ కుప్పకూలింది.  దీనిపై మాట్లాడిన ఆయన గ్లోబల్ రెసిషన్ దీనికి  కారణమన్నారు. “ 2008లో వచ్చిన ఆర్థిక సంక్షోభం మీకు తెలుసు కదా.. లేమాన్ బ్రదర్స్ కుప్పకూలింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ పట్టు తప్పింది. ఆ ప్రభావం ఇండియా  మీద కూడా ఉంటుంది కదా.. అదే  నా విషయంలో జరిగింది”  అని చెప్పుకొచ్చారు.  అమెరికా ఆర్థిక సంక్షోభం తర్వాత తనకు నిధుల రాక ఆగిపోయిందని ఎయిర్‌లైన్స్ నిర్వహించడం కష్టంగా మారిందని చెప్పాడు. కానీ తన ఎయిర్‌లైన్స్ పూర్తిగా దివాళా తీయడానికి ప్రభుత్వమే కారణమన్నారు.

ఏం పర్లేదు అని ప్రణబ్‌ చెప్పారు.

కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ పతనం అవ్వడానికి దారితీసిన పరిస్థితులు గురించి మాట్లాడిన విజయ్‌మల్యా.. అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. కింగ్ ఫిషర్‌లో నష్టాలు రాగానే తాను అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని కలిశానని.. ఎయిర్‌లైన్స్ ఆపరేషన్స్‌ తగ్గించి.. ఉద్యోగులను తగ్గించి నష్టాల నుంచి కొంతవరకూ తప్పిస్తానని చెప్పానని.. కానీ ప్రభుత్వం ఆ ప్రయత్నాన్నిఅడ్డుకుందని ఆయన చెప్పారు. “ నా సంస్థ నష్టాల్లో ఉన్నప్పుడు నేను ప్రణబ్‌ ముఖర్జీని కలిశాను. సంస్థ విస్తృతిని తగ్గిస్తానని చెప్పాను. కానీ ఆయన ఆ పని చేయొద్దన్నారు.  కావాలంటే బ్యాంకులు మీకు రుణాలిస్తాయని బ్యాంకులతో రుణాలు ఇప్పించారు..” అని మల్యా చెప్పారు. ఆ తర్వాత రుణాలు మోయలేని భారంగా మారిపోయాయన్నారు.

నేనేం దొంగను కాను..

ఇండియా నుంచి తప్పించనుని వెళ్లడంపై విజయ్ మల్యా స్పందించారు. పరిస్థితులను బట్టి తాను ఇండియాకు   ““తిరిగి రాకుండా జాగ్రత్త పడుతోంది నిజమే కానీ తాను దొంగను కానన్నారు.  “ భారత్‌లో నిజానిజాలు తెలీకుండా అందరికీ తప్పులు ఆపాదిస్తారని వ్యాఖ్యానించారు. “ నేను బ్యాంకులకు రుణాలివ్వలేదంటున్నారు.. తప్పించుకున్నా అంటున్నారు. అంతవరకూ సరే.. కానీ ఈ దొంగ  అనే విషయం ఎక్కడ నుంచి వచ్చింది.? నేనేం దొంగతనం చేశాను ” అని ప్రశ్నించారు.  తన లండన్‌ పర్యటన ముందుగా నిర్ణయించుకున్న ప్రకారమే జరిగిందని. కానీ దేశం దాటిన వెంటనే తనను మోసగాడిగా ముద్ర వేశారని.. పారిపోయినట్లుగా ప్రచారం చేసి కేసులు నమోదు చేశారని అంటున్నారు. తాను 9వేల కోట్లు మనీలాండరింగ్ కు పాల్పడినట్లు చేస్తన్న ప్రచారాలని  ఖండించారు. బ్యాంకులకు తాను ఇవ్వాల్సింది 6వేల కోట్లు మాత్రమే అయితే ఇప్పటికే తన 14వేల కోట్ల రూపాయల ఆస్తులను రికవరీ చేశారని ఆరోపించారు. తాను చెల్లించాల్సిన దాని కంటే ఎక్కువ వసూలు చేసిన బ్యాంకులే తనను దొంగ అంటూ ప్రచారం చేస్తే ఎలా అన్నారు.

ఇండియాకు వస్తారా..?

ఇండియాకు తిరిగి వచ్చే విషయం నేరుగా మాట్లాడకపోయినా.. ఇక్కడకు రావాలని ఆయనకు ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇండియాలో తన కేసుల విచారణ న్యాయబద్ధంగా జరిగితే రావాలనుకుంటున్నట్లుగా విజయ్ మాల్యా ఆ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు. విజయ్ మల్యాకు 1992 నుంచే యు.కెలో నివాసానికి అనుమతి ఉంది. దానిని వినియోగించుకునే ఆయన అక్కడకు వెళ్లిపోయారు. అప్పటి నుంచి భారత్‌ను తనను అప్పగించాలంటూ.. యు.కెతో సంప్రదింపులు చేస్తోంది. విజయ్‌మల్యాను భారత్‌కు తిరిగి అప్పగించడానికి బ్రిటన్ 2019లోనే అంగీకారం తెలిపింది. కానీ ఆ తర్వాత వచ్చిన న్యాయపరమైన చిక్కులతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఆ చిక్కులు ఏంటన్నది రెండు దేశాలూ బయటకు చెప్పడం లేదు. కానీ ప్రతీ సందర్భంలో మల్యాను తమకు అప్పగించాలని ఇండియా కోరుతూనే ఉంది కానీ అది మాత్రం జరగడం లేదు. ఇండియాకు రాకుండా మల్యాను రక్షిస్తూ ఓ బలమైన లాబీ పనిచేస్తోందని ప్రచారం ఉంది.