Viasakha News: చాలా గ్రామాల్లో బెల్టు షాపులు, వైన్ షాపులు ఉండాలని మందుబాబులు కోరుకుంటారు. మద్యం దుకాణాలు తమ గ్రామాల్లో వద్దంటూ మహిళలు మాత్రమే ఆందోళనలు చేయడం మనం చాలానే చూశాం. కానీ ఊరంతా ఏకమై తమ గ్రామంలో మద్యం దుకాణం వద్దని చెప్పడం చాలా అరుదు. మనం ఇప్పుటి వరకు ఇలాంటి చాలా తక్కువగా చూసి ఉంటాం. విని ఉంటాం. కానీ ఇప్పుడు ఇలాంటి విషయాన్నే మనం చూడబోతున్నాం. ఈ గ్రామస్థులంతా కలిసి తమ గ్రామంలో వైన్ షాప్ వద్దంటూ కోరుతున్నారు. 


అసలేం జరిగిందంటే..? 


విశాఖపట్నం జిల్లా అడవి వరం వద్ద ఉన్న రామకృష్ణాపురం గ్రామస్థులు తమ గ్రామంలో వైన్ షాపులు వద్దంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అందుకు బదులుగా  రామకృష్ణాపురం గ్రామానికి మిగిలి ఉన్న రోడ్లు పూర్తి చేయాలని, స్లాబులకు పర్మిషన్ ఇవ్వండని రిక్వెస్ట్ చేశారు. అలాగే గ్రామంలో ఉన్న శ్మశాన వాటిక చుట్టు పక్కల ప్రహారీ గోడ నిర్మాణం చేయాలని కమ్యూనిటీ భవనాలను నిర్మించాలని కోరారు. ఇవన్నీ పాయింట్లుగా రాసి పెట్టి ఉన్న ఫ్లెక్సీలను గ్రామంలోని ఎంట్రీ వద్ద ఉంచారు. అలాగే రామకృష్ణాపురం గ్రామ ప్రజలకు కూడా గ్రామ కమిటీ సభ్యులు పలు విజ్ఞప్తులు చేశారు.




"రామకృష్ణాపురం గ్రామ ప్రజలందరికీ నమస్కారం"..


ఫిబ్రవరి 22వ తేదీ 2023 ఉదయం 10 గంటలకు రామకృష్ణాపురం గ్రామంలోకి బ్రాందీ షాప్ పెడతామని కొంతమంది అధికారులు వచ్చారని తెలిపారు. దానిని పూర్తిగా వ్యతిరేకించి గ్రామ కమిటీ, గ్రామ ప్రజలు ఏకమై పూర్తిగా వ్యతిరేకించినట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే గురువారం రోజు ఉదయం 8 గంటల నుంచి గ్రామంలోని వేప చెట్టు దగ్గర నిరసన కార్యక్రమం చేపడుతున్నామని.. గ్రామంలో బ్రాందీ షాప్ పెట్టనివ్వకుండా ఉండడం కోసమే ఈ ఉద్యమం అని తెలిపారు. ఇందులో గ్రామంలో ఉన్న ప్రజలంతా పాల్గొనాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రామస్థులంతా ఈ నిరసన కార్యక్రానికి సహకరించాలని కోరారు. ఈ క్రమంలోనే ఈరోజు ఆ గ్రామ ప్రజలంతా తమ గ్రామంలో వైన్ షాప్ పెట్టొద్దంటూ ఆందోళన చేశారు.