ED Summons: 


అరాచక పాలన నడుస్తోంది: వేణుగోపాల్ 


దేశంలో అరాచక పాలన కొనసాగుతోందని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ విమర్శించారు. పార్లమెంట్‌లో ఉండగానే, ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖార్గేకు ఈడీ నోటీసులు పంపడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. "ప్రతి దానికీ ఓ పద్ధతి ఉంటుంది. మేం చట్టానికి అనుగుణంగా నడుచుకునే వాళ్లమే. కానీ పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష నేత ఖార్గే ఓ డిబేట్‌లో ఉన్నారు. అదే సమయంలో
ఈడీ సమన్లు జారీ చేయటాన్ని ఏమనుకోవాలి..?" అని అన్నారు వేణుగోపాల్. ఈ విషయంలో ఏ మాత్రం భయపడేది లేదని, కచ్చితంగా పోరాడతామని స్పష్టం చేశారు. ధరల పెరుగుదల, నిరుద్యోగంపై తమ నిరసనలు కొనసాగుతాయని వెల్లడించారు. రాజ్యసభలో మాట్లాడే సమయంలోనే మల్లికార్జున్ ఖార్గేకు ఈడీ సమన్లు అందటంపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడుతోంది. "మధ్యాహ్నం 12.30 నిముషాలకు నేను రాజ్యసభలో డిబేట్‌లో ఉన్నాను. ఆ సమయంలో ఈడీ నాకు సమన్లు జారీ చేసింది. నాకు కాల్ చేశారు. పార్లమెంట్‌లో ఉండగా నాకు సమన్లు జారీ చేసే హక్కు వారికెక్కడుంది..? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇళ్లను పోలీసులు కట్టడి చేయటం సబబేనా..? కాంగ్రెస్‌కుభయపడే భాజపా ఇలా ఉద్దేశపూర్వకంగా చేస్తోంది. మేం భయపడేది లేదు. తప్పకుండా పోరాడతాం" అని మల్లికార్జున్ ఖార్గే స్పష్టం చేశారు.





 మోదీ ఎందుకు భయపడుతున్నారు: దిగ్విజయ్ సింగ్


కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా ఈడీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. "పార్లమెంట్ సెషన్‌లో ఉండగా, ఓ ప్రతిపక్ష నేతకు ఈడీ సమన్లు జారీ చేయటం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఒకవేళ ఆయనకు సమన్లు ఇవ్వాలంటే ఉదయం 11 గంటలకు ముందైనా, లేదంటే సాయంత్రం 5 గంటల తరవాతైనా ఇవ్వాలి. కానీ ఇదేం తీరు..? ప్రధాని మోదీ ఎందుకు భయపడుతున్నారో అర్థం కావట్లేదు" అని దిగ్విజయ్ సింగ్ అన్నారు. అయితే కాంగ్రెస్ నేతల విమర్శలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలో కేంద్రం జోక్యం చేసుకోదని, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అలా జరిగుండొచ్చు అని ఎద్దేవా చేశారు. మొత్తానికి దాదాపు 15 రోజులుగా దేశవ్యాప్తంగా పలువురు ప్రతిపక్ష నేతలకు ఈడీ సమన్లు జారీ చేయటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భాజపా ఉద్దేశపూర్వకంగా ఇలా చేయిస్తోందని మండి పడుతున్నాయి.