Gyanvapi mosque case: జ్ఞానవాపి మసీదు కేసు కీలక మలుపు తిరిగింది. మసీదులో పూజలు చేసుకునేందుకు అనుమతినివ్వాలని కోరిన హిందువులకు సానుకూలంగా కోర్టు తీర్పునిచ్చింది. హిందువులు పూజలు చేసేందుకు అనుమతినిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. మసీదులో హిందూ దేవతల విగ్రహాలున్నాయని ఇటీవలే ASI సర్వే స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పు కీలకంగా మారింది. Vyas Ka Tekhana ప్రాంతం వద్ద హిందువులు పూజలు చేసుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల్లోగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని తేల్చి చెప్పింది. హిందువుల తరపున అడ్వకేట్ విష్ణు శంకర్ జైన్ వాదించారు. మసీదు లోపల పూజలు చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని స్పష్టం చేశారు. కాశీ విశ్వనాథ్ ట్రస్‌ ఈ తీర్పుపై స్పందించింది. ఇది హిందువుల విజయం అంటూ ఆనందం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల మేరకు వారం రోజుల్లో పూజలు మొదలు పెడతామని వెల్లడించింది. 








జ్ఞానవాపి వివాదంపై ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) ఇచ్చిన రిపోర్టు  (ASI Survey Report) జనవరి 25న విడుదలైంది. ప్రస్తుతం ఉన్న మసీదు స్థానంలో గతంలో ఆలయం ఉన్నట్లుగా ఏఎస్ఐ అధికారులు గుర్తించారు. 17వ శతాబ్దంలో ఆలయాన్ని కూల్చి మసీదును కట్టారని పురావస్తు శాఖ తేల్చింది. ఆ మసీదు కింద ఓ నిర్మాణం ఉన్నట్లుగా గుర్తించారు. హిందూ ఆలయంలోని కొన్ని స్తంభాలను చెక్కి మసీదు నిర్మాణంలో వాడినట్లుగా గుర్తించారు. జ్ఞానవాపి మసీదు కింది భాగంలో కొన్ని దేవతల విగ్రహాలు ఉన్నట్లుగా కూడా పురావస్తు నిపుణులు నివేదికలో పేర్కొన్నారు. ఈ రిపోర్టును ఏఎస్ఐ అధికారులు ఈ కేసులో ఇరు పక్షాలకు కాపీలను అందించారు. హిందూ తరపు న్యాయవాది విష్ణు జైన్ ఏఎస్ఐ నివేదికలోని ముఖ్యమైన అంశాలను వివరించారు. ఏఎస్‌ఐ రిపోర్టులో ఉన్న అంశాలన్నీ డాక్యుమెంట్‌గా ఉన్నాయని తెలిపారు. కట్టడాలకు ఎలాంటి హాని జరగకుండా నిపుణులు సైంటిఫిక్ సర్వే చేశారని వివరించారు. ఆ రిపోర్టులో ఉన్న వివరాల ప్రకారం.. కారిడార్ పక్కనే ఓ బావి కనిపించిందని విష్ణు జైన్ చెప్పారు. ఇక్కడ కనిపించే పూర్వ నిర్మాణం చాలా పెద్ద హిందూ దేవాలయం అని అన్నారు. ఏఎస్‌ఐ జీపీఆర్‌ సర్వే ప్రకారం హిందూ దేవాలయంలోని స్తంభాలపై నిర్మాణాలు జరిగాయి. ఇక్కడ ఒక గొప్ప హిందూ దేవాలయం ఉండేదని చెప్పవచ్చు. ఏఎస్ఐ నివేదిక ప్రకారం.. మసీదు కంటే ముందు హిందూ దేవాలయం ఉందని అన్నారు.


Also Read: Kota Suicides: కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలకు కారణాలేంటి? చదువులు ఎందుకు చంపుతున్నాయి?