Uttarakhand Anti Conversion Bill: 


పదేళ్ల జైలు శిక్ష..


ఉత్తరాఖండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చట్ట వ్యతిరేక మత మార్పిడిని కట్టడి చేసేందుకు యాంటీ కన్వర్షన్ బిల్‌ను (anti-conversion bill) అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. ఇకపై ఈ రాష్ట్రంలో ఎవరు చట్ట వ్యతిరేకంగా మతం మార్చాలని చూసినా...అది నేరంగా పరిగణిస్తారు. నాన్ బెయిలబుల్‌ నేరంగా చూడడంతో పాటు...కనీసం 3-10 ఏళ్ల జైలు శిక్ష విధించనున్నారు. ఇదే విషయాన్ని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ట్విటర్‌లో వెల్లడించారు. Uttarakhand Freedom of Religion (Amendment) Act 2022 కింద బలవంతంగా మత మార్పిడికి పాల్పడిన వారికి జైలు శిక్షతోపాటు రూ.50,000 జరిమానా విధించనున్నారు. అంతే కాదు. బలవంతపు మత మార్పిడులకు పాల్పడ్డ వ్యక్తులు.. బాధితులకు నష్ట పరిహారం కూడా చెల్లించక తప్పదు. రూ.5 లక్షల వరకూ ముట్టు చెప్పాల్సిందే.  ఇలా బలవంత మత మార్పిడికి పాల్పడిన వారికి గతంలో గరిష్ఠంగా ఏడేళ్ల జైలు శిక్ష విధించే వాళ్లు. కానీ...ఈ సారి ఆ గడువుని పెంచారు. "ఎవరైనా సరే. ఓ మతం నుంచి మరో మతంలోకి మార్చేందుకు ప్రయత్నించవద్దు. బెదిరించో, బలవంతం చేసో, ఇంకేదో ఆశ చూపించో ఇలాంటివి చేయడం నేరం. చట్ట ప్రకారం ఇది కుట్ర కిందకే వస్తుంది" అని యాక్ట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని 25,26,27,28 ఆర్టికల్స్ మత స్వేచ్ఛను తెలియజేస్తున్నాయి. ప్రతి మతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది" అని ప్రభుత్వం చెబుతోంది. 






సుప్రీం కోర్టు వ్యాఖ్యలు..


బలవంతపు మత మార్పిడిపై సుప్రీం కోర్టు ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేసింది. దీనిపై నిర్లక్ష్యం వహించకూడదని, ఎంతో కీలకమైన విషయమని తేల్చి చెప్పింది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని...దీన్ని కట్టడి చేసే మార్గాలు చూడాలని సూచించింది. "ఈ బలవంతపు మత మార్పిడులు ఆగకపోతే భవిష్యత్‌లో చాలా సంక్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది" అని వ్యాఖ్యానించింది. జస్టిస్ ఎమ్‌ఆర్ షా, జస్టిస్ హిమా కోహ్లితో కూడిన ధర్మాసనం సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు కొన్ని సూచనలు చేసింది. ఈ మత మార్పిడిని కట్టడి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పింది. "ఇది కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయం. కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి కట్టడి చేయాల్సిన అవసరముంది. ఇది జరగకపోతే చాలా సమస్యలు ఎదురవుతాయి. ఏమేం చర్యలు తీసుకోవచ్చో సూచించండి" అని వ్యాఖ్యానించింది. జాతీయ భద్రతనూ ఇది దెబ్బకొట్టే ప్రమాదముందని మత స్వేచ్ఛకూ భంగం కలిగిస్తుందని అభిప్రాయపడింది. అందుకే..ఇలాంటి బలవంతపు మత మార్పిడులపై కేంద్రం ప్రత్యేక చొరవ చూపించి కట్టడి చేయాలని ధర్మాసనం సూచించింది. అడ్వకేట్ అశ్విని కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు...ఈ వ్యాఖ్యలు చేసింది. "డబ్బు ఆశ చూపించి, గిఫ్ట్‌లు ఇస్తామని, 
బెదిరించి మత మార్పిడి చేయించడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి" అని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.


Also Read: Viral News: కొంప ముంచిన బెట్ సరదా, స్టేజ్‌పై వధువుకి ముద్దు పెట్టినందుకు పెళ్లి క్యాన్సిల్