Pitbulls Banned: 


పిట్‌బుల్‌పై బ్యాన్..


ఈ మధ్య కాలంలో కుక్కలు దాడులు చేసి తీవ్రంగా గాయపరుస్తున్న ఘటనలు చాలానే జరుగుతున్నాయి. యూపీలోనే వరుసగా రెండు మూడు సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. అప్పుడే..."పిట్‌బుల్" (Pitbull) జాతి కుక్కల్ని నిషేధించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. కొన్ని రోజులు ఈ హడావుడి చేసినా...తరవాత ఈ అంశం సద్దుమణిగింది. అయితే...యూపీలోని ఘజియాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్ మాత్రం దీన్ని సీరియస్‌గా తీసుకుంది. పిట్‌బుల్, రాట్‌వీలర్, డాగో అర్జెంటీనో జాతులకు చెందిన కుక్కల్ని పెంచుకోవడాన్ని నిషేధించింది. ఇక మిగతా శునకాలు పెంచుకోవాలంటే తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి లైసెన్స్ తీసుకోవాలని తేల్చిచెప్పింది. నవంబర్ 1వ తేదీ నుంచి లైసెన్స్‌లు జారీ చేయనున్నట్టు తెలిపింది. మరో రూల్ ఏంటంటే...ఒకటి కన్నా ఎక్కువ కుక్కల్నీ పెంచుకోకూడదు. కాంప్లెక్స్‌లలో నివసించే వాళ్లు తమ కుక్కల్ని సర్వీస్‌ లిఫ్ట్‌లో తీసుకురావాలని, అలా బయటకు తీసుకొచ్చిన సమయంలో వాటి మూతికి తప్పనిసరిగా ముట్టెలు(నోరు తెరవకుండా కట్టేయటం) పెట్టాలని ఆదేశించింది.


కొద్ది నెలలుగా ఘజియాబాద్‌లో కుక్కలు దాడులు చేస్తున్న ఘటనలు పెరగటం వల్లే మున్సిపల్ కార్పొరేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇతర జాతులకు చెందిన కుక్కలు ఉన్న వాళ్లు రెండు నెలల్లోగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందే. Pit Bull, Rottweiler,Dogo Argentino కుక్కలున్న వాళ్లకు మాత్రం లైసెన్స్ ఇవ్వరు. ఇకపైన ఎవరు కొనుగోలు చేసినా...దాడులు జరిగినా యజమానులదే పూర్తి బాధ్యత. ఇప్పటికే ఈ కుక్కలున్న వాళ్లు రెండు నెలల్లోగా వాటికి "సంతాన నియంత్రణ" ఆపరేషన్ చేయించాలని తేల్చి చెప్పారు. ఈ మధ్య కాలంలోనే దాదాపు 10 మంది చిన్నారులపై కుక్కలు దాడులు చేశాయి. ఓ బాలుడిని పిట్‌బుల్‌ జాతికి చెందిన కుక్క దాడి చేయగా...ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. 150 కుట్లు వేయాల్సి వచ్చింది. ఇది జరిగిన నాలుగు రోజులకే మరో బాలుడిపై దాడి జరిగింది.


ఆవుపైనా దాడి..


పిట్‌ బుల్‌ జాతికి చెందిన పెంపుడు కుక్క ఆవుపై విచక్షణారహితంగా దాడికి తెగబడిన ఘటన కాన్‌పూర్‌లో జరిగింది. ఆవు దవడను తన నోటితో కుక్క బలంగా కరిచి పట్టుకుంది. దీంతో ఆవు నొప్పితో మెలికలు తిరుగుతూ కనిపించింది. అయితే ఆవును రక్షించడానికి  కుక్క యాజమాని తీవ్రంగా ప్రయత్నించాడు. చేతులు, కర్రతో కొట్టినప్పటికీ కుక్క.. ఆవును ఎంతకూ వదిలి పెట్టలేదు. మరో ఇద్దరు, ముగ్గురు వచ్చి సాయం చేయగా చివరికి విడిచిపెట్టింది. అయితే అప్పటికే ఆవు నోటిపై లోతైన గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. కుక్క లైసెన్స్‌ చూపించాల్సిందిగా యజమానిని మున్సిపల్‌ అధికారులు ఆదేశించారు. కుక్కను కూడా స్వాధీనం చేసుకొని బోనులో ఉంచారు. ఆవును పశువైద్యశాలకు పంపించారు. ఆవుకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయనున్నట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్, కేరళలో ఇటీవల వరుసగా కొన్ని చోట్ల కుక్కలు పలువురిపై దాడి చేశాయి. వీధి కుక్కలే కాదు. పెంపుడు కుక్కలు కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నాయి.