US Visas to Indians:
10 లక్షలకు పైగా వీసాలు..
వీసాల విషయంలో ఇన్నాళ్లు ఉన్న సమస్యల్ని పరిష్కరిస్తోంది అగ్రరాజ్యం. ముఖ్యంగా భారతీయులకు వీసాలు జారీ చేయడంలో జాప్యం జరుగుతోందని గుర్తించిన అధికారులు ఆ గడువుని తగ్గించే పనిలో పడ్డారు. ఇప్పటికే అమెరికా ఈ విషయంలో హామీ కూడా ఇచ్చింది. ఇప్పుడు కొత్తగా మరో కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాదిలో భారతీయులకు దాదాపు 10 లక్షలకు పైగా వీసాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది. స్టూడెంట్ వీసాలు ఇవ్వడంలో ఇకపై ఎలాంటి ఆలస్యం ఉండకుండా చూస్తోంది బైడెన్ యంత్రాంగం. పీటీఐకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అమెరికాకు చెందిన ఓ ప్రతినిధి ఈ విషయం వెల్లడించారు. H-1Bతో L వీసాలకూ ప్రయారిటీ ఇస్తామని చెప్పారు. ఐటీ ఉద్యోగులకు కీలకమైన వీసాలు ఎక్కువగా జారీ చేయడం వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుందని భావిస్తోంది అగ్రరాజ్యం. H-1B..ఓ నాన్ ఇమిగ్రెంట్ వీసా. అమెరికన్ కంపెనీలు విదేశాల్లోని ఉద్యోగులను రప్పించుకోవాలంటే ఈ వీసాలు తప్పనిసరి. టెక్నికల్ స్కిల్స్ ఉన్న వాళ్లకే ప్రాధాన్యతనిస్తారు. భారత్ నుంచే కాకుండా చైనాకు చెందిన సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్‌ని కూడా అమెరికన్ కంపెనీలు భారీ సంఖ్యలో నియమించుకుంటున్నాయి. నిజం చెప్పాలంటే...అమెరికాలో స్థానికంగా ఉన్న ప్రొఫెషనల్స్ కన్నా భారత్, చైనా నుంచి వచ్చిన వాళ్లే ఎక్కువగా ఉంటారు. అందుకే...ఈ వీసాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది అమెరికా.
"ఈ ఏడాదిలో 10 లక్షలకు పైగా వీసాలు జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. స్టూడెంట్ వీసాలు, నాన్ ఇమిగ్రెంట్ వీసాల హిస్టరీలోనే ఇదో రికార్డు కానుంది. ఈ విషయంలో మేం చాలా కమిటెడ్‌గా ఉన్నాం."
- అమెరికా ప్రతినిధి
వెయిటింగ్ పీరియడ్ తగ్గుతుందట..
వీసాల వెయిటింగ్ పీరియడ్ ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. తొలిసారి వీసాలు అప్లై చేసుకునే వారికి మరింత సమస్యగా మారింది. బిజినెస్ (B1), టూరిస్ట్ (B2) వీసాల విషయంలోనూ ఇదే పరిస్థితి. అమెరికాకు వస్తున్న విద్యార్థుల సంఖ్యాపరంగా చూస్తే...ప్రపంచంలోనే భారత్ రెండో స్థానంలో ఉంది. వీసా వెయిటింగ్ పీరియడ్‌ను ఇకపై 60 రోజుల కన్నా తక్కువగా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు అమెరికా చెబుతోంది. అమెరికా, ఇండియన్ ఎకానమీకి సంబంధించిన అంశం కనుక...రెండు దేశాలూ దీనిపై ప్రత్యేక దృష్టి సారించినట్టు సమాచారం.
వీసాల రేట్‌లు పెరిగాయ్..
స్టూడెంట్ వీసాల ప్రాసెసింగ్ ఫీ పెంచుతున్నట్టు ఇప్పటికే అమెరికా ప్రకటించింది. యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికారికంగా వెల్లడించింది. నాన్ ఇమిగ్రెంట్ వీసాల అప్లికేషన్ ఫీజు పెంచడం వల్ల అమెరికాకు వెళ్లాలనుకునే వారికి ఆ మేరకు ఖర్చు పెరగనుంది. ఈ ఏడాది మే 30 నుంచి పెంచిన ప్రాసెసింగ్ ఫీ అమల్లోకి వస్తుందని వెల్లడించింది అగ్రరాజ్యం. విజిటర్, టూరిస్ట్, బిజినెస్, స్టూడెంట్, ఎక్స్‌ఛేంజ్ విజిటర్ వీసాలన్నింటికీ ఇది అమలు కానుంది. 2022 అక్టోబర్ 1 నుంచి వీసా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్లందరికీ ఈ పెంచిన ఫీలు అమలవుతాయని వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకూ ఇది అమలు కానుంది. పిటిషన్ బేస్డ్ నాన్ ఇమిగ్రెంట్ వీసాల ప్రాసెసింగ్ ఫీ కూడా పెరగనుంది.
"ఈ ఏడాది మే 30 నుంచి విజిటర్ వీసాలు, బిజినెస్/టూరిజం వీసాలతో (B1/B2)పాటు స్టూడెంట్, ఎక్స్‌చేంజ్ విజిటర్ వీసాల ఫీ పెరగనుంది. ప్రస్తుతం ఈ రుసుము 160 డాలర్లుగా ఉంది. దీన్ని 185 డాలర్లకు పెంచుతున్నాం"
- యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్
Also Read: PM Modi Kerala Visit: ప్రధాని మోదీకి ప్రాణహాని ఉందంటూ లేఖ, అలెర్ట్ అయిన కేరళ పోలీసులు