ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన హమాస్‌ సంస్థ దాడులు చేయడాన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది. ఈ దాడులు ఎదుర్కోవడానికి ఇజ్రాయెల్‌కు అమెరికా అండగా ఉంటుందని అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్‌ స్పష్టంచేశారు. ఇజ్రాయెల్‌కు అన్ని రకాలుగా సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపారు. మానవీయ కోణంలో ఇదొక ఘోరమైన విషాదంగా ఆయన పేర్కొన్నారు. తనను, తన ప్రజలను రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని, ఈ పరిస్థితో ప్రయోజనం పొందేందుకు ఇజ్రాయెల్‌తో శత్రుత్వం ఉన్న వారు ప్రయత్నించొద్దంటూ అమెరికా హెచ్చరించింది. దాడికి ఎదుర్కొంటున్న ఆ దేశ పౌరులకు అమెరికా సహాయం అందిస్తుందని అమెరికా అధ్యక్ష భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బైడెన్‌ వెల్లడించారు. 


ఇజ్రాయెల్‌ రక్షణ కోసం అవసరమైన సాయం అందించడానికి నిబద్ధతతో ఉన్నామని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ హామీ ఇచ్చారు. అమెరికా, ఇజ్రాయెల్‌ అధికారుల మధ్య సైనిక సహాయానికి ఇప్పటికే చర్చలు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. దీనిపై త్వరలోనే ప్రకటన చేస్తామని అమెరికా సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. 


ఇజ్రాయెల్‌పై శనివారం భయంకరమైన దాడి జరిగింది. హమాస్‌ మిలిటెంట్లు ఏకంగా ఐదు వేల రాకెట్లను ప్రయోగించారు. జ్రాయెల్‌పై  5వేల రాకెట్లను ప్రయోగించారు.  ఇజ్రాయెల్-గాజా సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. హమాస్ గ్రూప్ సభ్యులు ఇజ్రాయెల్ సరిహద్దుల్లోకి చొచ్చుకొచ్చారు. ఇళ్లు, పోలీస్ స్టేషన్లలో చొరబడి దొరికిన వస్తువులను ఎత్తుకెళ్లారు. ఆపరేషన్ 'అల్-అక్సా ఫ్లడ్'తో హమాస్ ఇజ్రాయెల్‌పై యుద్ధం ప్రకటించింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆపరేషన్ 'స్వార్డ్స్ ఆఫ్ ఐరన్'తో ప్రతీకారం చర్యలకు దిగింది. హమాస్‌ దాడుల కారణంగా ఇప్పటికే మూడు వందల మందికి పైగా మరణించినట్లు సమాచారం. మరోవైపు ఇజ్రాయెల్‌ జరిపిన దాడిలో దాదాపు 200 మంది మరణించినట్లు పాలిస్తీనా వెల్లడించింది. ఇరువైపులా ఇప్పటికే వేలాది మంది గాయాలపాలయ్యారు. పరిస్థితి క్షతగాత్రులతో భయానకంగా మారింది. ఇజ్రాయెల్‌లో మృతుల సంఖ్య పెరుగుతూ పోతోంది. ఉగ్రవాదులు ఇళ్లలోకి చొరబడి మరీ ప్రజలను కాల్చి చంపుతున్నారని ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది.


ఇజ్రాయోల్‌ ప్రధాన మంత్రి బెంజిమిన్‌ నెతన్యాహు హమాస్‌ టెర్రర్‌ గ్రూప్‌ దాడి తర్వాత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌ ఇప్పుడు యుద్ధంలో ఉందని ప్రకటించారు. పాలస్తీనా ఇందుకు మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. పాలస్తీనాతో యుద్ధంలో ఇజ్రాయెల్‌ గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు. శత్రువులు ఇంతకు ముందెన్నడూ లేని విధంగా మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. గాజా ఆధారిత టెర్రర్ గ్రూప్ దాడి ప్రారంభించిన ఐదు గంటల తర్వాత అతని బలమైన ప్రకటనలు వచ్చాయి.


గాజా నుంచి ఇజ్రాయెల్‌పై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు జర్మనీ విదేశాంగ మంత్రి ప్రకటించారు. హమాస్ టెర్రరిస్టులు క్రూరమైన దాడిపై ఇటలీ ఆగ్రహం వ్యక్తం చేసింది.  పాలస్తీనా దాడుల నుంచి తమను తాము రక్షించుకునే  హక్కు ఇజ్రాయెల్ కు ఉందని స్పష్టం చేసింది. అమాయక పౌరులపై జరుగుతున్న ఉగ్రవాదాన్ని, హింసను ఖండించింది.   ఇజ్రాయెల్‌ పౌరులు నిద్రిస్తున్న సమయంలో హమాస్‌ దాడికి పాల్పడిందని, ఇది పిరికి చర్య అని భారత్‌లోని ఇజ్రాయెల్‌ రాయబారి నౌర్‌ గిలోన్‌ అన్నారు.  బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ కూడా ఇజ్రాయెల్‌పై దాడిని ఖండించారు. ఇజ్రాయెల్‌కు మద్దతిస్తామని తెలిపారు.