ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యకు సంబంధించి భారత్‌, కెనడా మధ్య నడుస్తున్న దౌత్యవివాదంపై అమెరికా కెనడాకు అనుకూలంగా స్వరం మారుస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ కేసు విషయంలో కెనడా చేస్తున్న దర్యాప్తుకు భారత్‌ సహకరించాలని గతంలో పలుమార్లు సూచించింది. ఇరు దేశాలు తమకు ముఖ్యమేనని, రెండూ తమకు మిత్ర దేశాలే అని చెప్తున్నప్పటికీ కెనడాకు సహకరించమని భారత్‌కు చెప్తూ వస్తోంది. తాజాగా మరోసారి ఇలాంటి వ్యాఖ్యలే చేసింది అమెరికా.  కెనడా భారతపై చేస్తున్న ఆరోపణలు చాలా తీవ్రమైనవని, దీనిపై పూర్తిగా దర్యాప్తు జరగాల్సిందేనని అమెరికా వెల్లడించింది. వైట్‌ హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో అమెరికా జాతీయ భద్రతా మండలిలో స్ట్రాటజిక్‌ కమ్యూనికేషన్స్‌ కోఆర్డినేటర్‌ జాన్‌ కిర్బీ ఈ వ్యాఖ్యలు చేశారు. గత వారం భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సుల్లివన్‌ సమావేశమైనప్పుడు ఈ విషయం గురించి చర్చించినట్లు చెప్పారు.


జాన్‌ కిర్బీకి విలేకరుల సమావేశంలో ఎదురైన ప్రశ్నకు సమాధానమిస్తూ.. 'ఈ విషయం గురించి చర్చ జరిగింది. ఆ దేశాల ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించుకునేందుకు కచ్చితంగా వారికే వదిలేస్తాము. అయితే మేము ఈ విషయంపై స్పష్టంగా ఉన్నాము. ఈ ఆరోపణలు తీవ్రమైనవి. ఇంతకుముందు కూడా దర్యాప్తులో చురుకుగా పాల్గొనాలని భారత్‌ను కోరాం. ఈ విషయంపై విచారణ జరిగాల్సిందే' అని వెల్లడించారు. మరో విలేకరుల సమావేశంలో అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ స్పోక్స్‌పర్సన్‌ వేదాంత్‌ పటేల్‌ మాట్లాడుతూ.. కెనడా దర్యాప్తు ముందుకు సాగడం, నేరస్థులకు న్యాయం చేయడం చాలా క్లిష్టమైనదని పేర్కొన్నారు. తాము గతంలో బహిరంగంగా, ప్రైవేట్‌ మీటింగ్స్‌లో కూడా చెప్పినట్లు కెనడా దర్యాప్తుకు భారత్‌ సహకరించాలని కోరాము అని వెల్లడించారు. 


భారత్‌లోని కెనడా హైకమిషన్‌ కోసం దౌత్య సిబ్బంది స్థాయిలపై నివేదికలను అమెరికా చూసిందని, కానీ ఆ నివేదికలపై తానేమీ చెప్పనని, ఊహాజనితంగా ఏమీ మాట్లాడాలనుకోవడం లేదని వేదాంత్‌ అన్నారు. ఇది మా ఇండో-పసిఫిక్‌ వ్యూహానికి సంబంధించిందని, ఈ ప్రాంతంపై తమ దృష్టి కొనసాగుతుందని తెలిపారు. భారతదేశంతో మేము క్వాడ్‌ సహా చాలా వాటిలో భాగస్వాములుగా ఉన్నాము, మేము భారత్‌తో పాటు ఇతర దేశాలతో అనేక ముఖ్యమైన సమస్యలపై పనిచేస్తూనే ఉంటామని వెల్లడించారు. కానీ మేము చెప్పినట్లు ఈ ఆరోపణలు చాలా తీవ్రమైనవిగా పరిగణిస్తున్నాము, మేము కెనడాతో సన్నిహితంగా పనిచేయడమే కాకుండా దర్యాప్తుకు సహకరించాలని భారత్‌ను కోరుతున్నామని వేదాంత్‌ పటేల్‌ స్పష్టంచేశారు.ఈ ఏడాది జూన్‌ 18న కెనడాలో ఖలిస్థానీ సానుభూతి పరుడు హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య జరిగింది.అయితే కెనడా పౌరుడైన నిజ్జర్‌ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో వారి పార్లమెంటులో తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అయినప్పటికీ కెనడా తన వాదన నుంచి వెనక్కి తగ్గడం లేదు. తమకు విశ్వసనీయమైన సమాచారం ఉందని చెప్తోంది. కానీ దానిని బయటకు వెల్లడించడం లేదు. భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌ కూడా కెనడా ఆరోపణలను తోసిపుచ్చారు. నిజ్జర్‌ హత్యకు సంబంధించి నిర్దిష్ట సమాచారం అందిస్తే భారత్‌ దర్యాప్తుకు సహకరిస్తుందని జైశంకర్‌ హామీ ఇచ్చారు.