H-1B Visa Holders:


కమిటీ సూచన..


ప్రపంచవ్యాప్తంగా బడా కంపెనీలన్నీ లేఆఫ్‌లు కొనసాగిస్తున్నాయి. వేలాది మంది ఉద్యోగులు ఇంటి బాట పడుతున్నారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, అమెజాన్, ట్విటర్...ఇలా అన్ని సంస్థల్లోనూ ఉద్యోగాల కోతలు భారీగానే ఉంటున్నాయి. ఈ క్రమంలోనే విదేశాల్లో ఉన్న భారతీయుల్లో గుబులు మొదలైంది. జాబ్ సెక్యూరిటీ విషయంలో కంగారు పడిపోతున్నారు. ఈ క్రమంలోనే అమెరికా కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లకు కాస్తంత ఊరట కలగనుంది.  H1B Visaతో అమెరికాలో ఉన్న ఉద్యోగులు...జాబ్ పోయాక 60 రోజుల్లోగా మరో కంపెనీలో చేరాలి. మళ్లీ ఆ కంపెనీ వీసాతో మరి కొన్నాళ్ల పాటు అక్కడ పని చేసుకునేందుకు వీలుంటుంది. అయితే...ఈ గడువుని 60 రోజుల నుంచి 180 రోజులకు పెంచింది. ప్రెసిడెన్షియల్ అడ్వైజరీ సబ్ కమిటీ ప్రభుత్వానికి ఇదే విషయాన్ని సూచించింది. వేలాది మంది H1B వర్కర్లకు ఇది ఊరట కలిగిస్తుందని తెలిపింది. 180 రోజుల గడువు ఉంటే వాళ్లు మరో ఉద్యోగం చూసుకునేందుకు అవకాశముంటుందని వివరించింది. H-1B అనేది నాన్ ఇమిగ్రెంట్ వీసా. అమెరికా కంపెనీలు విదేశాల నుంచి ఉద్యోగులను రప్పించుకుని పని చేయించుకునేందుకు ఈ వీసాలు వీలు కల్పిస్తాయి. అయితే...ఈ మధ్య కాలంలో భారీ ఎత్తున లేఆఫ్‌లు జరుగుతున్నాయి. అంతకు ముందు నిబంధన ప్రకారం 60 రోజుల్లోనే మరో ఉద్యోగం చూసుకోవడం కష్టమైపోతోంది. అందుకే ఈ గడువుని పెంచాలని కమిటీ సూచించింది. ఈ వీసాపై వచ్చిన వాళ్లంతా నిపుణులే. అలాంటి వాళ్లను కోల్పోవడానికి బదులుగా కొన్ని మినహాయింపులు ఇవ్వడం మంచిదనే ఆలోచనలో ఉంది బైడెన్‌ యంత్రాంగం. అయితే అధికారికంగా ఈ ప్రకటన ఎప్పుడు చేస్తారన్నది తేలాల్సి ఉంది. 


ఇటీవలే కీలక నిర్ణయం..


యూఎస్‌లో చదువుకోవాలని కలలు కనే విద్యార్థులకు ఆ దేశం తీపి కబురు అందించింది. కోర్స్‌ మొదలయ్యే సంవత్సరం ముందే వీసా తీసుకునేందుకు అవకాశం కల్పించనుంది. ఇప్పటికే వీసాల కోసం రోజుల తరబడి ఎదురు చూస్తున్న వారికి ఇది ఊరటనివ్వనుంది. సాధారణంగా వెయిటింగ్ పీరియడ్‌ 300 రోజుల వరకూ ఉంటోంది. అయితే...భారత్, అమెరికా మధ్య పలు రౌండ్ల చర్చల తరవాత...వరుసగా అమెరికా వీసా నిబంధనలను సులభతరం చేస్తూ వస్తోంది. వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే విద్యార్థులు అకాడమిక్ కోర్స్‌ మొదలయ్యే ఏడాది ముందే వీసా తీసుకునేలా వెసులుబాటు కల్పించనుంది. అమెరికా బ్యూరో ఆఫ్ కన్సూలర్ అఫైర్స్ అధికారికంగా ఈ ప్రకటన చేసింది. F,M కేటగిరీల్లో  విద్యార్థులకు ఇచ్చే వీసాలను 365 రోజుల ముందే జారీ చేసేలా రూల్ మార్చింది. 


"I-20 ప్రోగ్రామ్‌లో భాగంగా F&M స్టూడెంట్ వీసాలను 365 రోజుల ముందే జారీ చేయనున్నాం. తద్వారా ఎక్కువ మంది విద్యార్థులు వీసాల కోసం అప్లై చేసుకునేందుకు వీలుంటుంది" 


-యూఎస్ బ్యూరో 


ఏడాది ముందే వీసా వచ్చినప్పటికీ కోర్సు మొదలు కాకముందే విద్యార్థులు అమెరికాకు వెళ్లేందుకు అనుమతి ఉండదు. కోర్సు మొదలయ్యే 30 రోజుల కన్నా ముందు అనుమతించరు. యూనివర్సిటీలో అడ్మిషన్ దొరికిన విద్యార్థులు వీసా ఇంటర్వ్యూలను 120 రోజులు ముందుగానే షెడ్యూల్ చేసుకోవచ్చని అగ్రరాజ్యం వెల్లడించింది. 


Also Read: Adani Row: పార్లమెంట్ నుంచి ఈడీ కార్యాలయానికి ప్రతిపక్ష ఎంపీల ర్యాలీ, అదానీ అంశంపై విచారణకు డిమాండ్