Opposition MPs Rally:
రెండో విడత పార్లమెంట్ సమావేశాలు మొదలైనప్పటి నుంచి రాజకీయాలు మరింత వేడెక్కాయి. అదానీ అంశంపై చర్చ జరపాల్సిందేనని ప్రతిపక్షాలు పట్టు పడుతున్నాయి. దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నాయి. తమ డిమాండ్‌లను కేంద్రం పట్టించుకోడం లేదని, మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాల రాస్తోందని మండి పడుతున్నారు నేతలు. ఈ క్రమంలోనే పార్లమెంట్ నుంచి ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలందరూ ఈడీ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహిస్తున్నారు. అదానీ అంశంపై విచారణ జరపాలని మెమొరాండం సమర్పించేందుకు వెళ్తున్నారు. ఫలితంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సెక్షన్ 144 అమల్లో ఉందని, ఎంపీలెవరూ ర్యాలీ చేయడానికి వీల్లేదని తేల్చి చెబుతున్నారు. ఇక్కడ ఆందోళనలు చేపట్టడం కుదరదంటూ ప్రకటనలు చేస్తున్నారు. ప్రతిపక్ష ఎంపీలు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా ర్యాలీ కొనసాగిస్తున్నారు. అయితే ఈ ర్యాలీలో ఎన్‌సీపీ సహా తృణమూల్ నేతలు పాల్గొనడం లేదు.