Land For Jobs Scam:


14 మంది నిందితులు..


ల్యాండ్ ఫర్ జాబ్‌ స్కామ్‌ కేసులో భాగంగా బిహార్ మాజీముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సహా ఆయన కుటుంబ సభ్యులందరి ఇళ్లలోనూ సీబీఐ, ఈడీ సోదాలు జరిగాయి. ఈ కేసులో మొత్తం 14 మందిని నిందితులుగా చెబుతున్నాయి దర్యాప్తు సంస్థలు. ఈ స్కామ్‌లో లాలూ సతీమణి రబ్రీదేవి పాత్ర కూడా ఉందని అంటున్నాయి. ఈ మేరకు ఛార్జ్‌షీట్ తయారు చేసింది..CBI. ఇవాళ (మార్చి 15వ తేదీన) ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో లాలూ సహా మొత్తం 14 మంది హాజరయ్యారు.  


"బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి, కూతురు, RJD ఎంపీ మిసా భారతి ల్యాండ్ ఫర్ జాబ్‌ కేసులో భాగంగా రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరయ్యారు"


-ANI






ఇదీ కేసు..


2004-09 మధ్య కాలంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా పని చేశారు. ఆ సమయంలోనే గ్రూప్‌ డి ఉద్యోగాలు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున స్థలాలు తమ పేరిట రాయించుకున్నారన్న ఆరోపణలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా రిక్రూట్‌మెంట్ చేశారని సీబీఐ చెబుతోంది. జనరల్ మేనేజర్ స్థాయి వ్యక్తుల్నీ రిఫరెన్స్ ద్వారా రిక్రూట్ చేశారని అంటోంది. లాలూని రెండు గంటల పాటు ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ విచారణ మొత్తాన్ని వీడియో తీసింది ఈడీ. ఇప్పటికే సీబీఐ ఈ కేసుకు సంబంధించి ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవితో పాటు మొత్తం 14 మంది పేర్లు చేర్చింది. లాలూ హయాంలో  ఈ స్కామ్ జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. గ్రూప్ డి ఉద్యోగాలు ఇచ్చేందుకు పలు చోట్ల స్థలాలను లంచంగా తీసుకున్నట్టు చెబుతోంది ఈడీ. 2004-09 మధ్య కాలంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలోనే ఈ స్కామ్ జరిగినట్టు ED అధికారులు ఆరోపిస్తున్నారు. ముంబయి, జబల్‌పూర్, కోల్‌కత్తా, జైపూర్, హాజిపూర్‌లలో పలువురికి గ్రూప్‌ D పోస్ట్‌లు ఇచ్చారని, అందుకు బదులుగా తమ పేరు మీద స్థలాలు రాయించుకున్నారని చెబుతున్నారు. AK Infosystems Private Limited పేరు మీద కూడా స్థలాలు రాయించారని ED వివరిస్తోంది. ఆ తరవాత ఈ కంపెనీ ఓనర్‌షిప్‌ను లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యుల పేరుపై మార్చారన్న ఆరోపణలున్నాయి. ఇటీవలే ఢిల్లీ, ముంబయి, పాట్నాలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు ఈడీ అధికారులు. లాలూ కుమారుడు, బిహార్ డిప్యుటీ సీఎం తేజస్వీ యాదవ్ ఇంట్లోనూ సోదాలు జరిగాయి. విచారణకు హాజరు కావాలని నోటీసులు అందించారు అధికారులు. అయితే భార్య ఆరోగ్య బాగోలేదని, హాజరు కాలేనని అధికారులకు తెలిపారు తేజస్వీ యాదవ్. 


Also Read: మళ్లీ కోత మొదలెట్టిన 'మెటా', ఈసారి 10వేల మంది ఇంటికి!