తెలంగాణలో పోటీ పరీక్షల ప్రశ్నాపత్రం లీకేజీ రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.  ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకొన్న విపక్షాలు ఆందోళనబాటపడుతున్నాయి. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పార్టీ యువజన విభాగంతోపాటు ఆప్‌ నేతలు, మరికొన్ని ప్రజాసంఘాలు TSPSCని ముట్టడికి యత్నించాయి.  


బీజేవైఎం, ఆప్, లెక్చరర్ల సంఘం నేతలు తెలంగాణ స్టేట్‌ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ ముట్టడికి యత్నించాయి. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి చేయిదాటిపోకుండా ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ప్రశ్నాపత్రం లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. దశలవారీగా నిరసనకారులు వస్తుండటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. 



టిఎస్పిఎస్సిలో ప్రశ్న పత్రాల లీకేజీకి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి అని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు డిమాండ్ చేశారు. ఓయూలో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. టి ఎస్ పి ఎస్ సి పేపర్ లీక్ పై హైకోర్టు సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలి డిమాండ్ చేశారు. టిఎస్పిఎస్సిలో ప్రశ్న పత్రాల లీకేజీకి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని విద్యార్థులు నినాదాలు చేశారు. 


టి ఎస్ పి ఎస్ సి చైర్మన్‌ను బాధ్యతల నుంచి తప్పించాలని... మొత్తం బోర్డునే  ప్రక్షాళన చేయాలన్నారు విద్యార్థులు. ఎన్ని పరీక్షల  పేపర్లు లీకేజీ చేశారో ఆయా పరీక్షలు రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టాలన్నారు. ప్రశ్నపత్రాలు లీకేజీ చేసి అమ్ముకుంటున్న వారిని  కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి ఓయూ పీఎస్ కు తరలించారు.