➥ ఇకనుంచి జరిగే అన్ని పరీక్షలకు కొత్త ప్రశ్నపత్రాలు


➥ ప్రిలిమినరీలో ప్రవీణ్‌కు 103 మార్కులే వచ్చాయి


➥ అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్షపై మార్చి 15న నిర్ణయం


➥ టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ బి.జనార్దన్‌రెడ్డి వెల్లడి


రాష్ట్రంలో గ్రూప్-1 ప్రధాన పరీక్షలు (మెయిన్స్) షెడ్యూలు ప్రకారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ బి.జనార్దన్ రెడ్డి తెలిపారు. అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో అనుమానాలకు తావులేకుండా ఇకనుంచి నిర్వహించే పోటీ పరీక్షలకు కొత్త ప్రశ్నపత్రాలు రూపొందిస్తామని వివరించారు. దీనికి కొంత సమయం పడుతుందని చెప్పారు. ఏప్రిల్ 4 నుంచి జరిగే పరీక్షలన్నీ షెడ్యూలు ప్రకారం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.


ఏఈ పరీక్షపై మార్చి 14న సాయంత్రం సమావేశమై నిర్ణయం తీసుకోవాలని భావించినప్పటికీ పోలీసుల నివేదిక రావడంలో ఆలస్యమైందన్నారు. దీనిపై కమిషన్ బుధవారం (మార్చి 15) నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. టీఎస్‌పీఎస్సీలో నమ్మిన ఉద్యోగులే గొంతు కోశారన్నారు. ఏఈ పోస్టుల ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం, ఉద్యోగ పోటీ పరీక్షలపై వస్తున్న వదంతుల నేపథ్యంలో మార్చి 14న టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో కమిషన్ సభ్యులతో కలిసి జనార్దన్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రశ్నపత్రం లీకేజీపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని.. అందులోనూ, ఫోరెన్సిక్ నివేదికలోనూ మిగతా విషయాలు వెల్లడవుతాయన్నారు.


ప్రిలిమినరీలో ప్రవీణ్‌కు 103 మార్కులు నిజమే, కానీ..
ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు, కమిషన్ కార్యాలయ ఉద్యోగి ప్రవీణ్ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష రాశాడని, అతనికి 103 మార్కులు వచ్చిన మాట వాస్తవమే అని ఛైర్మన్ వెల్లడించారు. పరీక్ష రాసేందుకు ప్రవీణ్ కమిషన్ నుంచి అనుమతి తీసుకున్నాడని తెలిపారు. అతనికి వచ్చిన మార్కులే ఎక్కువంటూ వస్తున్న వదంతులు సరికాదని, అతనికి వచ్చిన మార్కులే ప్రిలిమినరీలో అత్యధికం కాదని జనార్దన్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే ప్రవీణ్ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు అతను అర్హత సాధించలేదని, గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షపై చాలా వదంతులు వస్తుండటంతో ప్రధాన పరీక్షకు సన్నద్ధమవుతున్న 25 వేల మంది అభ్యర్థుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయన్నారు. పేద అభ్యర్థులతో పాటు ఉద్యోగాలకు సెలవులు పెట్టి, విదేశాల నుంచి వచ్చి ప్రధాన పరీక్షకు సిద్ధమవుతున్నారు. పోలీసుల దర్యాప్తులో వెల్లడైన ఆధారాల అనుగుణంగా గ్రూప్-1 మెయిన్ పరీక్షపై షెడ్యూలు ప్రకారం ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ క్లారిటీ ఇచ్చారు. ప్రిలిమినరీ పరీక్షలో ప్రతిభ ఆధారంగా దేశంలోనే అత్యధికంగా 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేశామని, తన పిల్లలు టీఎస్‌పీఎస్సీ పరీక్షలు రాయలేదని, మా మేనల్లుడు రాస్తానంటే ఛైర్మన్ ఉద్యోగం వదిలేస్తానని స్పష్టంగా చెప్పినట్లు జనార్దన్‌రెడ్డి తెలిపారు.


త్వరలో మరో 3వేల పోస్టులకు నోటిఫికేషన్లు..
రాష్ట్రంలో త్వరలో మరో 3 వేలకు పైగా పోస్టులకు రెండు, మూడు నెలల్లో ఉద్యోగ ప్రకటనలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. టీఎస్‌పీఎస్సీ గతేడాది నుంచి ఇప్పటివరకు 41 కేటగిరీల్లో 23 వేల ఉద్యోగాలకు సంబంధించి 26 నోటిఫికేషన్లు జారీ చేసిందన్నారు. ఇప్పటికే ఏడు పరీక్షలు నిర్వహించామని, ఎనిమిదో పరీక్ష టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ (టీపీబీవో) జరగాల్సి ఉంది. అప్పటికే హ్యాక్ అయినట్లు అనుమానం రావడంతో దాన్ని వాయిదా వేశామని ఛైర్మన్ తెలిపారు. మొత్తం 175 టీపీబీవో పోస్టులకు 33 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారన్నారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నపత్రాల కాపీ ప్రవీణ్ వద్ద దొరికిందని వెల్లడించారు. మరో నిందితుడు రాజశేఖర్ టీఎస్‌పీఎస్సీలో ఏడేళ్లుగా సిస్టమ్ అనలిస్ట్‌గా పనిచేస్తున్నారు. అతనికి అన్ని ఐపీ అడ్రస్‌లు తెలుసు. ఇద్దరూ కలిసి పాస్‌వర్డ్ తస్కరించి హ్యాకింగ్‌కు పాల్పడ్డారు. ఉద్యోగులకు సైబర్ భద్రత, సాంకేతిక, న్యాయపరమైన అంశాలపై పరిజ్ఞానం పెంపొందించేందుకు శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించాం. కమిషన్ కార్యాలయంలో సైబర్ ఆడిట్ నిర్వహిస్తున్నట్లు జనార్దన్ రెడ్డి వివరించారు.


Also Read:


గ్రూప్‌-1 అభ్యర్థులకు అలర్ట్ - మెయిన్స్‌ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ
 తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష తేదీలను ఖరారు చేసింది. ఇప్పటికే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించిన టీఎస్ పీఎస్సీ తాజాగా మంగళవారం నాడు మెయిన్స్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షలు జూన్ 5 నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్‌ 5 నుంచి 12వ తేదీ వరకు అర్హత సాధించిన అభ్యర్థులకు గ్రూప్-1 మెయిన్స్‌ నిర్వహించాలని టీఎస్ పీఎస్సీ నిర్ణయించింది. 
గ్రూప్-1 మెయిన్స్‌ షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


'గ్రూప్-1' మెయిన్స్ పరీక్షా విధానం ఖరారు! పేపర్లు, మార్కుల వివరాలు ఇలా!
తెలంగాణలో తొలి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా విధానం ఖరారైంది. నిపుణుల కమిటీ సూచన మేరకు పరీక్షా విధానానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జనవరి 18న ఆమోదం తెలిపింది. టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో మెయిన్స్ పరీక్షా విధానం వివరాలను పొందుపరిచింది. మెయిన్స్ పేపర్ విధానం, సెక్షన్ల వివరాలు, ప్రశ్నల ఛాయిస్ తదితర వివరాలకోసం టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని ఉద్యోగార్థులకు సూచించింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


ఉద్యోగ నియామకాలు వేగవంతం చేయండి, అధికారులకు సీఎస్ ఆదేశం!
రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు వేగవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై సీఎస్ మార్చి 14న సమీక్ష నిర్వహించారు. తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్‌లో నియామక బోర్డుల అధికారులతో ఈ సమావేశం నిర్వహించారు. టీఎస్పీఎస్సీ భర్తీ చేస్తున్న అసిస్టెంట్ ఇంజినీర్ ప్రశ్నాపత్రం లీకైందని తేలడంతో ఉద్యోగ నియామకాలపై సీఎస్ సమీక్ష జరిపారు. 
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...