Joe Biden On Putin:


సరైన నిర్ణయమే: బైడెన్ 


రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఈ నిర్ణయం సరైందేనని సమర్థించారు. యుద్ధ నేరాలు పాల్పడిన వారిపై ఇలాంటి కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు. అందుకే అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్టు వెల్లడించారు.  The Guardian ఈ విషయం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ కోర్టు తీర్పులను కొన్ని దేశాలు పరిగణనలోకి తీసుకోకపోయినప్పటికీ పుతిన్ విషయంలో ఆ కోర్టు ప్రస్తావించిన అంశాలు సరైనవే అని స్పష్టం చేశారు. నిజానికి పుతిన్‌పై చాన్నాళ్లుగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బైడెన్. పదేపదే అణు బాంబుల గురించి ప్రస్తావించడాన్ని చాలా సందర్భాల్లో ఖండించారు. కవ్వింపు చర్యలకు పాల్పడితే గట్టిగా బదులిస్తామని హెచ్చరించారు. ఉక్రెయిన్‌కు మద్దతుగా ఉంటామనీ భరోసా ఇచ్చారు. ఇటీవలే జో బైడెన్ ఉక్రెయిన్  కీవ్‌లో ఆకస్మికంగా పర్యటించారు. ముందుగా పోలాండ్‌ లో పర్యటించిన జో బైడెన్... ఆ దేశ అధ్యక్షుడితో భేటీ అయ్యారు. అనంతరం కీవ్ వెళ్లిన బైడెన్ ఉక్రెయిన్ రాజధానిలో ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశం అయ్యారు.  జెలెన్స్కీతో కలిసి ఉక్రెయిన్ కోసం పోరాడిన సైనికుల కోసం ఏర్పాటుచేసిన వాల్ ఆఫ్ రిమెంబరెన్స్‌ను సందర్శించారు. రష్యా-ఉక్రెయిన్ వార్ మొదలైన తర్వాత మొదటిసారి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ లో పర్యటించారు. 


ఈ నిర్ణయం చెల్లదు: రష్యా 


ఉక్రెయిన్‌పై ఏడాది కాలంగా యుద్ధం చేస్తున్న రష్యాకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు షాక్ ఇచ్చింది. పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీనిపై రష్యా స్పందించింది. International Criminal Court (ICC) తీసుకున్న నిర్ణయాన్ని ఖండించింది. ఉక్రెయిన్‌పై యుద్ధం చేయడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించడంపైనా అసహనం వ్యక్తం చేసింది. Reuters ప్రకారం...రష్యా ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. ICC నిర్ణయంపై తమకు ఎన్నో అనుమానాలున్నాయని తేల్చి చెప్పారు. ఇది కచ్చితంగా అనైతికం అంటూ మండిపడ్డారు. రష్యాతో పాటు మరెన్నో దేశాలు ICC విధానాలను వ్యతిరేకిస్తున్నాయని గుర్తు చేశారు. "ICC తీసుకున్న ఏ నిర్ణయమైనా చెల్లదు. రష్యా చట్టం ప్రకారం ఈ తీర్పుని మేం ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదు" స్పష్టం చేశారు. ఒకవేళ పుతిన్ వేరే దేశానికి వెళ్లినప్పుడు ICC అరెస్ట్ వారెంట్ ప్రకారం ఆయనను అదుపులోకి తీసుకుంటే ఎలా..? అని మీడియా అడిని ప్రశ్నపై అసహనం వ్యక్తం చేశారు రష్యా ప్రతినిధి. "ప్రస్తుతానికి దీనిపై చర్చ అనవసరం. మేం చెప్పాలనుకుంటోంది కూడా ఇదే" అని సమాధానమిచ్చారు. రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి  మరియా జకోర్వా కూడా ఇదే బదులు ఇచ్చారు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు తీర్పుని రష్యా పరిగణనలోకి తీసుకోవడం లేదని తేల్చి చెప్పారు. దాదాపు ఏడాదిగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో రెండు దేశాలూ పట్టు వీడటం లేదు. ఫలితంగా భారీ స్థాయిలో ఆస్తి నష్టం వాటిల్లుతోంది. 


Also Read: Donald Trump: ట్రంప్ ఈజ్ బ్యాక్, రీ యాక్టివ్ అయిన సోషల్ మీడియా అకౌంట్‌లు