Army chief Manoj Pandey:
మొహరిస్తూనే ఉంటాం: మనోజ్ పాండే
భారత్, చైనా సరిహద్దులో పరిస్థితులు ప్రస్తుతానికి స్తబ్దుగానే ఉన్నాయని ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే వెల్లడించారు. ఓ టీవీ ఛానల్ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ఆయన..ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే...చైనా ఎప్పుడు ఎలా కవ్విస్తుందో తెలియదు కనుక అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమూందని తేల్చి చెప్పారు. రెండు దేశాలూ కలిసి కూర్చుని చర్చించుకునే ఈ సమస్యను పరిష్కరించుకోవాలని ఆకాంక్షించారు. అప్పటి వరకూ సైన్య మొహరింపు చర్యలు కొనసాగుతూనే ఉంటాయని వెల్లడించారు. "ఈ సరిహద్దు సమస్యకు పరిష్కారం దొరికేంత వరకూ సైన్యాన్ని భారీ మొత్తంలో మొహరిస్తూనే ఉంటాం. అప్రమత్తంగానూ ఉంటాం" అని వివరించారు. యుద్ధ రీతులు మారిపోవడం గురించీ ప్రస్తావించారు. ఆర్టిఫిషయల్ ఇంటిలిజెన్స్‌పైనా తన అభిప్రాయాలు పంచుకున్నారు.
"ప్రస్తుతానికి సరిహద్దులో పరిస్థితులు ప్రశాంతంగానే ఉన్నాయి. అయినా సరే మేం అప్రమత్తంగా ఉన్నాం. చైనా ప్రతి కదలికనూ సునిశితంగా పరిశీలిస్తున్నాం. సైన్యాన్ని మొహరించే విషయంలో మాత్రం రాజీ పడడం లేదు. ఆ సంఖ్యను తగ్గించే ఉద్దేశమూ లేదు. అవసరాలకు తగ్గట్టుగా సైన్యంలో మార్పులు చేర్పులు చేస్తున్నాం. ముఖ్యంగా LAC వద్ద మొహరించిన సైన్యానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నాం"
- మనోజ్ పాండే, ఆర్మీ చీఫ్
ఈ సరిహద్దు ప్రాంతంలో మౌలిక వసతుల నిర్మాణాలు కూడా చాలా వేగంగా పూర్తవుతున్నాయని చెప్పారు మనోజ్ పాండే. ఎయిర్‌ఫీల్డ్‌లు, హెలిప్యాడ్‌లను అప్‌గ్రేడ్ చేస్తున్నట్టు వివరించారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కోడానికి సరిపడ సామర్థ్యం ఉందని తేల్చి చెప్పారు.
"ప్రస్తుతం నెలకొన్న వివాదాన్ని మిలిటరీ కమాండర్ స్థాయిలో చర్చలు జరిపి పరిష్కరించుకోవచ్చు. గతేడాది డిసెంబర్‌లో ఓ సారి ఈ చర్చలు జరిగాయి. ఇక దౌత్యవేత్తల సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి"
- మనోజ్ పాండే, ఆర్మీ చీఫ్
అమెరికా మద్దతు..
ఎప్పుడు చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతుందో చెప్పలేని పరిస్థితి. ఇటు భారత్ మాత్రం యుద్ధ వాతావరణమే వస్తే దీటుగా బదులిస్తామని గట్టిగా చెబుతోంది. ఈ క్రమంలోనే యూఎస్ ఇంటిలిజెన్స్ రిపోర్ట్ కీలకంగా మారింది. భారత్, చైనా మధ్య పరిస్థితులు అదుపు తప్పితే అమెరికా జోక్యం చేసుకుంటుందని తేల్చి చెప్పింది. Annual Threat Assessment పేరిట ఈ రిపోర్ట్‌ను విడుదల చేసింది అమెరికా జాతీయ నిఘా విభాగం. ఆ రెండు దేశాల మధ్య ఎన్నాళ్లుగానో కొనసాగుతున్న సరిహద్దు వివాదం గురించి ప్రస్తావించింది.
"భారత్, చైనా మధ్య సరిహద్దు వివాద పరిష్కారానికి చర్చలు జరుగుతున్నాయి. కానీ 2020లో జరిగిన ఘర్షణను దృష్టిలో పెట్టుకుని నిశితంగా గమనిస్తున్నాం. అణ్వస్త్రాలున్న రెండు దేశాల మధ్య ఏ కాస్త పరిస్థితులు అదుపు తప్పినా అది అమెరికాకు కూడా చేటు చేస్తుంది. అలాంటి సమయంలో అమెరికా జోక్యం చేసుకోక తప్పదు. క్రమంగా ఈ రెండు దేశాల మధ్య ఘర్షణ ముదిరేలా కనిపిస్తోంది"
- అమెరికా నిఘా విభాగం
అమెరికా తమ ప్రజల్ని కాపాడుకునేందుకే ప్రాధాన్యతనిస్తుందని ఈ రిపోర్ట్‌లో తేల్చి చెప్పింది ఇంటిలిజెన్స్. అటు భారత్, పాకిస్థాన్ మధ్య ఉన్న వివాదాన్నీ ప్రస్తావించింది. కశ్మీర్‌లో ఉగ్రదాడులు విపరీతంగా పెరిగిపోయే ప్రమాదముందని హెచ్చరించింది. ఈ సంక్షోభం ఇంకా ముదిరే అవకాశముందని అంచనా వేసింది. అయితే..యాంటీ ఇండియా మిలిటరీ గ్రూప్స్‌కు పాకిస్థాన్ మద్దతునిస్తోందని, కానీ మోదీ పాలనలో ఎలాంటి దాడులకు పాల్పడాలని చూసినా...ఎదురు దాడులు తప్పవని స్పష్టం చేసింది.
Also Read: మిలెట్స్ పోస్టల్ స్టాంప్ విడుదల చేసిన ప్రధాని మోదీ, రెండ్రోజుల పాటు గ్లోబల్ మిలెట్ కాన్ఫరెన్స్