International Year of Millets:


ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిలెట్స్


ఢిల్లీలో Global Millets Conferenceలో ప్రధాని నరేంద్ర మోదీ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిలెట్స్ 2023 కి సంబంధించిన అధికారిక పోస్ట్‌ స్టాంప్‌లను విడుదల చేశారు. ఈ స్టాంప్‌లు విడుదల చేయడం చాలా గర్వంగా ఉందని అన్నారు ప్రధాని. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిలెట్స్‌కు భారత్ నేతృత్వం వహించడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి కాన్ఫరెన్స్‌లు ప్రపంచానికి మేలు చేయడమే కాకుండా...భారత్‌ బాధ్యతనీ పెంచుతుందని వ్యాఖ్యానించారు. 


"ఐక్యరాజ్య సమితి 2023 సంవత్సరాన్ని International Year of Milletsగా ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని భారత్‌ లీడ్ చేయడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది. ఇది మన దేశానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమంలో దాదాపు 75 లక్షల మంది రైతులు వర్చువల్‌గా పాల్గొంటున్నారు. దేశంలో దాదాపు 2.5 కోట్ల మంది తృణధాన్యాలు పండిస్తున్నారు. ఇలాంటి రైతులకు కేంద్ర ప్రవేశ పెట్టిన శ్రీ అన్న పథకం ఎంతో లబ్ధి చేకూరుస్తుంది. మార్కెట్‌లోనూ వారికి సముచిత గౌరవం తెచ్చి పెడుతుంది. తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. ఈ సాగు పెరిగితే కొత్త ఉద్యోగాలు కూడా పుట్టుకొస్తాయి."


- ప్రధాని నరేంద్ర మోదీ






ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కూడా పాల్గొన్నారు. శ్రీ అన్న పథకానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతుందని స్పష్టం చేశారు. దాదాపు 100 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి కొందరు వర్చువల్‌గా పాల్గొననున్నారు. 2021 మార్చి 5వ తేదీన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2023 ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిలెట్స్‌గా ప్రకటించింది. భారత్ ప్రతిపాదనకు గౌరవమిస్తూ ఈ ప్రకటన చేసింది. తృణధాన్యాల ద్వారా పోషకాహార లోపాన్ని జయించవచ్చని చెబుతోంది. 


ఎన్నో లాభాలు..


భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యాన్ని అందించే పంటలపై ఆసక్తి పెరిగింది. రాగులు, సజ్జలు, అరికెలు, ఊదల వంటి తృణధాన్యాలు తిన్న తర్వాత మెల్లగా గ్లూకోస్‌ను విడుదల చేసే సంగతి తెలిసిందే. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయులు తగ్గుతున్నాయి. డయాబెటిస్‌ ముప్పు తగ్గుతోంది. భారతీయుల ఆరోగ్యంతో పాటు ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు భారత్‌కు అవకాశం దొరికింది. అందుకే ఐక్య రాజ్య సమితితో ఈ ఏడాదిని 'తృణధాన్యాల సంవత్సరం'గా ప్రకటించేలా పావులు కదిపారు. టాటా కన్జూమర్స్‌, ఐటీసీ వంటి బ్రాండ్లు తృణధాన్యాల ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. తృణధాన్యాలతో ఇడ్డీరవ్వ, ఉప్మా రవ్వా, దోసె పిండి, బిస్కెట్లు ఉత్పత్తి చేస్తున్నాయి. పైగా ఐటీసీ తమ హోటళ్లలో తృణధాన్యాల భోజనాలను ప్రవేశపెట్టబోతోందని తెలిసింది. చిరు ధాన్యాలు తినడం వల్ల రక్తంలో గ్లూకోజు స్థాయిలు 12-15 శాతం తగ్గుతాయి! అలాగే ఒక కిలో ధాన్యాలను పండించేందుకు 650-1200 లీటర్ల నీరు సరిపోతుంది. అదే ఒక కిలో బియ్యానికి 5000 లీటర్ల నీరు అవసరం. పైగా విటమిన్లు, ఖనిజాలు దేహానికి లభిస్తాయి. వివిధ సూక్ష్మపోషకాలు దొరుకుతాయి.


Also Read: తమిళనాడులో బిహార్ కార్మికులపై దాడుల కేసులో కీలక పరిణామం, యూట్యూబర్ అరెస్ట్