Tata-Bisleri Deal End: దేశంలో ఒక భారీ డీల్‌ అర్ధంతరంగా ముగిసింది, స్టాక్‌ మార్కెట్‌ ఆశలపై "నీళ్లు" చల్లింది. దేశంలోని ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రికింగ్‌ వాటర్ బాటిల్ బ్రాండ్ 'బిస్లరీ'ని ‍‌(Bisleri) కొనుగోలు చేసే ప్రయత్నాలకు టాటా గ్రూప్‌ (Tata Group) స్వస్తి పలికింది. టాటా గ్రూప్‌నకు చెందిన FMCG కంపెనీ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. 


"ప్రతిపాదిత లావాదేవీకి సంబంధించి బిస్లరీతో ఇప్పుడు చర్చలను నిలిపివేశాం. ఈ విషయంలో కంపెనీ ఎటువంటి ఖచ్చితమైన ఒప్పందం (definitive agreement) చేసుకోలేదు, లేదా, కమిట్‌మెంట్‌ ఇవ్వలేదని ధృవీకరిస్తున్నాం" అని ఎక్సేంజ్‌ ఫైలింగ్‌లో టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ (Tata Consumer Products) పేర్కొంది.


సుమారు రూ.7000 కోట్ల డీల్‌
బిస్లరీ బ్రాండ్‌ను సుమారు రూ. 7000 కోట్లకు కొనుగోలు చేసేందుకు టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్  సిద్ధమవుతోందని గత సంవత్సరం వార్తలు వచ్చాయి. కంపెనీని కొనుగోలు చేసేందుకు బిస్లరీ ప్రమోటర్లతో టాటా గ్రూప్‌ సుమారు రెండేళ్ల పాటు చర్చలు జరిపింది. ఇప్పుడు ఆ చర్చలకు టాటా గ్రూప్‌ నీళ్లొదిలేసింది.


బిస్లరీ ఛైర్మన్ రమేష్ చౌహాన్‌కు 82 సంవత్సరాలు. ఆయన అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. బిస్లరీ బ్రాండ్‌ను నడిపించే వారసుడు లేడు. ఈ కారణంగా బిస్లరీని విస్తరించలేకపోయారు. ఆయన కుమార్తె జయంతి చౌహాన్‌కు వ్యాపారంపై ఆసక్తి లేదు. అందుకే బిస్లరీ బ్రాండ్‌ను విక్రయించాలనుకున్నారు. 


టాటా గ్రూప్‌పై నమ్మకం పెట్టుకున్న రమేష్ చౌహాన్
బిస్లరీ బ్రాండ్‌ను మరింత మెరుగైన రీతిలో టాటా గ్రూప్ ముందుకు తీసుకెళ్లగలదని గతంలో చర్చలు కొనసాగిన సమయంలో రమేష్ చౌహాన్ చెప్పారు. అయితే, తాను ఎంతో శ్రమకోర్చి నిర్మించిన బిస్లరీ బ్రాండ్‌ను విక్రయించడం తనకు చాలా కష్టమైన నిర్ణయంగా అప్పట్లో అభివర్ణించారు. టాటా గ్రూప్ సంస్కృతి, విలువలు, నిజాయతీపై తనకు నమ్మకం ఉందని, అందుకే ఆ గ్రూప్‌నకు బిస్లరీని అప్పగిస్తున్నాని కూడా రమేష్ చౌహాన్ చెప్పారు. చాలా ఇతర కంపెనీలు బిస్లరీని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయని, అయితే, తాము టాటాలను ఇష్టపడుతున్నారని అప్పట్లో అన్నారు. 


బిస్లరీ గతంలో రిలయన్స్ రిటైల్, నెస్లే, డానోన్‌తోనూ చర్చలు జరిపింది, అవి కూడా సఫలం కాలేదు. ఆ తర్వాత టాటా గ్రూప్‌ను రమేష్‌ చౌహాన్‌ సంప్రదించారు. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, టాటా కన్స్యూమర్ CEO సునీల్ డిసౌజాను కూడా రమేష్ చౌహాన్ కలిశారు. అయితే, రెండేళ్ల పాటు చర్చలు జరిపినా బిస్లరీ - టాటా గ్రూప్‌ మధ్య డీల్ కుదరలేదు.


రమేష్‌ చౌహాన్‌ బిజినెస్‌ ఫోర్ట్‌ఫోలియోలో బిస్లరీ మాత్రమే కాదు... థమ్స్‌అప్‌ ‍‌(Thumsup), గోల్డ్‌స్పాట్‌ (Goldspot), మాజా (Maaza), లింకా (Limca) వంటి బ్రాండ్లు ఉన్నాయి. వాటిని రమేశ్‌ చౌహానే సృష్టించారు. కోకకోలా (Coca Cola) కంపెనీ వాటిని 1993లో కొనుగోలు చేసింది.


టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్‌ (TCPL) బిజినెస్‌ ఫోర్ట్‌ఫోలియోలోనూ హిమాలయన్‌ (Himalayan), టాటా కాపర్‌ ప్లస్‌ (Tata Copper+), టాటా గ్లూకో+ (Tata Gluco+) బ్రాండ్లు ఉన్నాయి. ఇవన్నీ ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ బ్రాండ్లే. ఈ సెగ్మెంట్‌లో దేశంలోనే టాప్‌ ప్లేస్‌లో ఉన్న బిస్లరీని కొనుగోలు చేయడం ద్వారా లీడర్‌ లెవల్‌కు వెళ్లాలని, మంచినీళ్ల వ్యాపారంలో భారీగా విస్తరించాలని TCPL కూడా భావించింది.