Joe Biden Confused: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మళ్లీ అంతే వింతగా ప్రవర్తించారు. ఓ కార్యక్రమంలో వేదికపై ఉన్న వాళ్లను వదిలేసి మరో వైపు చూస్తూ ఉండిపోయారు. చాలా సేపటి వరకూ కదల్లేదు. అదే స్టేజ్‌పై ఉన్న మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇది గమనించి వెంటనే బైడెన్ వైపు వెళ్లారు. ఆయన భుజంపై చేయి వేసి మెల్లగా నడిపించారు. దాదాపు 15 సెకన్ల పాటు బైడెన్ ఫ్రీజ్ అయిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదంతా కెమెరా కంట పడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బైడెన్, ఒబామా కలిసి దాదాపు 45 నిముషాల పాటు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ తరవాత ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో కార్యక్రమానికి వచ్చిన వాళ్లంతా లేచి చప్పట్లు కొట్టారు. ఇద్దరికీ అభినందనలు తెలిపారు. బైడెన్‌తో పాటు ఒబామా అందరికీ అభివాదం చేశారు. అప్పటి వరకూ బాగానే ఉన్న బైడెన్‌ ఉన్నట్టుండి ఫ్రీజ్ అయ్యారు. అలా ఆడియెన్స్‌వైపు చూస్తూ నిలబడిపోయారు. ఓ 10 సెకన్ల తరవాత ఒబామా బైడెన్‌ని గమనించారు. అందరికీ అభివాదం చేస్తూనే బైడెన్‌ని కదిలించారు. అప్పుడు కానీ ఆయనలో చలనం రాలేదు. ఆ తరవాత ఒబామా బైడెన్‌ని తనతో పాటు తీసుకెళ్లారు. 




ఇక ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇంత వయసు వచ్చినా ఇంకా రాజకీయాల్లో ఎందుకు ఉంటున్నారో అర్థం కావడం లేదని కొందరు ఫైర్ అవుతున్నారు. ఇదంతా జరుగుతున్నా బైడెన్‌ యాక్టివ్‌గా ఉన్నారని వాదించే వాళ్లపై మండి పడుతున్నారు. ఇక మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.