Himalayas US Nuclear fallout: చైనా అణుకార్యక్రమాలపై నిఘా పెట్టేందుకు అమెరికా గూఢచార సంస్థ సీఐఏ హిమాలయాల్లో పెట్టిన ఓ అణు పరికరం మిస్ అయ్యింది. దాని వల్లనే రేడియేషన్ ప్రభావం కనిపిస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. 1964లో అమెరికా సీఐఏతో హిమాలయాల్లోని నందాదేవిపై చైనా గూఢచర్యం కోసం అణు శక్తితో నడిచే పరికరాలు ఏర్పాటు చేశారు. దీనికి భారత ప్రభుత్వం సహకరించింది. అయితే తదనంతర పరిణామాల్లో ఆ పరికరాలను అక్కడే వదిలేశారు. మంచు చరియలు విరిగిపడటంతో ఆ పరికరాలు కనిపించకుండా పోయాయి. ఇప్పుడు అదే సమస్యగా మారిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. చైనా 1964లో తొలి అణు పరీక్ష చేసిన తర్వాత, అమెరికా సీఐఏ , భారత ఇంటెలిజెన్స్ బ్యూరో సంయుక్తంగా నందాదేవి ప్లూటోనియం మిషన్ పేరుతో ఆపరేషన్ చేపట్టాయి. ఉత్తరాఖండ్‌లోని నందాదేవి శిఖరం 7,816 మీటర్లు ఎత్తు ఉంటుంది. ఆ శిఖరంపై ప్లూటోనియం శక్తితో నడిచే స్నాప్ జనరేటర్ ఏర్పాటు చేయడమే లక్ష్యం. ఇది చైనా అణు, మిస్సైల్ కార్యకలాపాలను గమనించేందుకు ఉపయోగపడుతుంది. 1965లో భారత-అమెరికా బృందం పరికరాలను తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. కానీ తీవ్ర మంచు తుఫాను వల్ల శిఖరానికి చేరలేదు. పరికరాలను తాత్కాలికంగా భద్రపరిచి తిరిగి వచ్చారు.
1966లో తిరిగి వెళ్లినప్పుడు అవి కనిపించలేదు . మంచు కొండచరియలు కూలిపోవడం వల్ల గల్లంతయ్యాయి. ఈ పరికరాల్లో ప్లూటోనియం-238 ఉండటం వల్ల రేడియేషన్ లీక్ అవుతుందనే ఆందోళనలు వచ్చాయి. 1967లో సమీపంలోని నందా కోట్ శిఖరంపై మరో పరికరం ఏర్పాటు చేశారు కానీ నందాదేవి పరికరం ఇప్పటికీ కనిపించలేదు. గంగా నది నందాదేవి మంచు దిబ్బల నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి రేడియేషన్ కలుషితం అయ్యే ప్రమాదం ఉందనే భయాలు ఉన్నాయి.
1978లో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ లోక్‌సభలో ఈ ఆపరేషన్‌ను అంగీకరించారు. ఇటీవల న్యూయార్క్ టైమ్స్ ఈ విషయంపై వివరంగా నివేదిక ప్రచురించింది. ఉత్తరాఖండ్ నుంచి బెంగాల్ వరకు గంగా నది ఒడ్డున నివసించే ప్రజల్లో క్యాన్సర్ వ్యాధి పెరుగుతోందని.. హిమాలయాల్లో మంచు దిబ్బలు కరిగిపోవడం, క్లౌడ్ బరస్టులు, ఇళ్లలో పగుళ్లు రావడం వంటి సమస్యలకు కారణమని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేదార్‌నాథ్ విపత్తు, తీస్తా నది వరదలు, గంగోత్రి-యమునోత్రి మంచు కరిగిపోవడం, గంగా నీటి మట్టం తగ్గడం వంటివి ఈ అణు పరికరాల లీకేజీ వల్లే జరుగుతున్నాయని కొంత మంది విశ్లేషిస్తున్నారు.