కిమ్ జోంగ్ ఉన్.. ఈ పేరు వింటేనే క్షిపణలు, దుందుడుకు చర్యలు, మాస్ వార్నింగ్‌లే గుర్తొస్తాయి. ప్రపంచాన్ని గడగడలాడించిన కిమ్.. ఇప్పుడు మళ్లీ క్షిపణ పరీక్షలకు పదునుపెడుతున్నారు. వరుస మిస్సైల్ లాంచింగ్‌లతో అగ్రరాజ్యానికే సవాల్ విసురుతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఉన్న సమయంలో కాస్త వెనక్కి తగ్గిన కిమ్.. ఇప్పుడు స్పీడు పెంచారు. కానీ బైడెన్ సైలెంట్‌గా ఉంటున్నారు. అసలు కిమ్ గురించి ఎందుకు బైడెన్ పట్టించుకోవడం లేదు? 


కిమ్ గురించి హెచ్చరిక..


బరాక్ ఒబామా అధ్యక్ష పదవి నుంచి దిగిపోయే సమయంలో డొనాల్డ్ ట్రంప్‌కు ఓ హెచ్చరిక చేశారు. అమెరికాకు.. ఉత్తర కొరియాతో పెద్ద సమస్యగా మారే అవకాశం ఉందని ఒబామా అన్నారు. ముఖ్యంగా కిమ్ జోంగ్ ఉన్.. దుందుడుకుతనం ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ట్రంప్‌కు సూచించారు. ట్రంప్ సైతం కిమ్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఒప్పించో, భయపెట్టో మొత్తానికి అయితే కిమ్‌ను కంట్రోల్‌లో పెట్టారు. కానీ కిమ్.. వరుస క్షిపణి ప్రయోగాలతో భయపెడుతున్నా బైడెన్ మాత్రం.. నిశ్శబ్దంగా ఉన్నారు. 


ఎందుకీ సైలెంట్..?


ఉత్తర కొరియాతో చర్చలు పునరుద్ధరించేందుకు బైడెన్ యంత్రాంగం ఆసక్తి కనబరుస్తోంది. కిమ్.. క్షిపణి ప్రయోగాలను ఆపేందుకు ఆంక్షలు కూడా ఎత్తివేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. ఉత్తర కొరియాపై బైడెన్ ప్రత్యేక దృష్టి సారించారు. అయితే కొంత వేచి ఉండే ధోరణిని ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌లో నెలకొన్న పరిణామాలతో పోల్చి చూస్తే ఉత్తర కొరియాను అంత సీరియస్‌గా తీసుకోనవసరం లేదని బైడెన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.


కిమ్ ప్లాన్ ఏంటి?


ప్రస్తుతం ఉత్తర కొరియాపై అణ్వాయుధాలు, బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలపై అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నాయి. అయినప్పటికీ ఉత్తర కొరియా ప్రయోగాలను ఆపడం లేదు. అయితే క్రూయిజ్ క్షిపణి ప్రయోగాలపై బ్యాన్ లేనప్పటికీ ఈ తరహా కార్యకలాపాలు ప్రమాదకరమని అమెరికా అంటోంది.


ఇదే సరైన సమయమని కిమ్.. వరుస క్షిపణి ప్రయోగాలతో అమెరికాపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా చేస్తే అమెరికా తనంతట తానే చర్చలకు పిలిచి ఆంక్షలు సడలిస్తుందని కిమ్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.


ఇప్పటికే అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ విషయంలో బైడెన్ పై ప్రపంచదేశాలు ఆరోపణలు చేస్తున్నాయి. అఫ్గాన్ సంక్షోభానికి బైడెన్ నిర్ణయమే కారణమని విమర్శిస్తున్నాయి. మరి తాజాగా ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలతో బైడెన్‌పై మరింత ఒత్తిడి పెరిగినట్లే కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు.


Also Read: SC on Farmers Protest: 'రైతులారా ఇక ఆపండి.. నగరానికి ఊపిరాడనివ్వండి'


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి