US Immigration Fee Hike:
200% పైగా పెరుగుదల..
అమెరికా వెళ్లాలని కలగనే వారికి ఆ దేశ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వీసాల ఛార్జీలను భారీగా పెంచేసింది. H-1B వీసాలతో పాటు మరి కొన్ని వీసాలపైనా 200%కిపైగా ఛార్జీలు పెంచుతూనిర్ణయం తీసుకుంది బైడెన్ ప్రభుత్వం. H-1B ప్రీ రిజిస్ట్రేషన్ ఫీజులు 10 డాలర్ల నుంచి ఏకంగా 215డాలర్లకు పెరిగింది. H-1 వీసాలపై 460 డాలర్లుగా ఉన్న ఫీజ్‌ని 780 డాలర్లకు పెంచింది అమెరికా. ఇక L వీసాల రుసుమునీ 460 డాలర్ల నుంచి 1,385 డాలర్లకు పెంచింది. ఇతరత్రా స్కిల్ బేస్డ్ ఉద్యోగాలు చేసే వారికి ఇచ్చే O కేటగిరీ వీసాలపైనా 129% మేర ఫీజ్ పెంచేసేంది
బైడెన్ యంత్రాంగం. ఇన్వెస్టర్‌లు,బడా వ్యాపారవేత్తలకు ఇచ్చే EB-5 వీసాలు (మిలియనీర్ వీసాలు) కూడా ప్రియం కానున్నాయి. ప్రస్తుతం వీటి ఫీజు 3,675 డాలర్లుగా ఉంది. ఇప్పుడీ రుసుము 11,160 డాలర్లకు పెరిగింది. అంటే..దాదాపు 204% మేర పెంచేసింది. ప్రీమియమ్ ప్రాసెసింగ్ ఛార్జీల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేర్పులు లేవు. పైగా..కొన్ని ఛార్జీలను తగ్గించాలని చూస్తోంది అమెరికా. ఫెడరల్ రిజిస్టర్‌లో ఈ కొత్త ఫీజులను పబ్లిష్ చేశారు. హోమ్‌లాండ్ సెక్యూరిటీ విభాగం ఈ వివరాలు వెల్లడించింది. కార్యకలాపాలు కొనసాగించాలంటే...నిర్వహణ ఖర్చులు భరించాలంటే...ఈ మాత్రం ఫీజు పెంచక తప్పదని తేల్చి చెప్పింది...US Citizenship and Immigration Services ఏజెన్సీ. "చాలా రోజుల రివ్యూ తరవాత ఈ ఫీజులు పెంచాల్సి వచ్చింది. 2016 నుంచి ఈ ఛార్జీలను మేం పెంచలేదు. ఖర్చులు పెరుగుతున్నాయి. వాటిని భర్తీ చేసుకు నేందుకు పెంచక తప్పడం లేదు" అని స్పష్టం చేసింది. కొవిడ్ కారణంగా దాదాపు 40% మేర ఆదాయం తగ్గిపోయిందని వివరించింది.
గతేడాది భారీగా వీసాల జారీ..
అమెరికా వెళ్లాలని కలలు కనే వారికి వీసా చిక్కులు ఎప్పుడూ ఇబ్బందులు పెడుతూనే ఉంటాయి. వెయిటింగ్ టైమ్ పెరుగుతున్న కొద్ది టెన్షన్ పెరిగిపోతుంటుంది. ఈ మధ్య కాలంలో ఈ సమస్య మరీ ఎక్కువైంది. కొవిడ్ సంక్షోభ సమయంలో చాలా వరకూ యూనివర్సిటీలు మూత పడ్డాయి. భారతీయ విద్యార్థులకు అడ్మిషన్లు ఆలస్యమయ్యాయి. కొంత కాలంగా అన్ని యూనివర్సిటీలు మళ్లీ తెరుచుకుంటున్నాయి. ఫలితంగా...వీసాల అప్లికేషన్లు కుప్పల కొద్ది వచ్చి పడుతున్నాయి. చాన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు అమెరికా చొరవ చూపూతోంది. గతేడాది అత్యధికంగా 1,25,000 మంది భారతీయ విద్యార్థులకు వీసాలు జారీ చేసినట్లు వెల్లడించింది. ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ వెయిటింగ్ టైమ్‌ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్టు స్పష్టం చేసింది. అంతకు ముందుతో పోల్చి చూస్తే...2022లోనే ఇండియన్ స్టూడెంట్స్‌కి ఎక్కువ వీసాలు ఇచ్చినట్టు వివరించింది. పలు దేశాల్లో కరోనా ఆంక్షలు ఎత్తివేయడం వల్ల అమెరికాకు వీసా దరఖాస్తులు వెల్లువెత్తాయని, అందుకే జారీలో కాస్త జాప్యం జరుగుతోందని తెలిపింది. తగినంత సిబ్బంది లేకపోవడం వల్ల కూడా సమస్యలు ఎదురయ్యాయని చెప్పింది. కొద్ది రోజుల్లోనే వీసాల జారీ ప్రక్రియ మళ్లీ వేగం పుంజుకుంటుందని హామీ ఇచ్చింది అగ్రరాజ్యం.
Also Read: US Utah Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం, 8 మంది మృతి