Antiquities return to India: భారత్‌ నుంచి అక్రమ మార్గాల్లో అమెరికాకు తరలించిన 297 పురాతన వస్తువులు (ఆంటిక్విటీస్‌) తిరిగి మన దేశానికి రానున్నాయి. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అమెరికా పర్యటనలో ఆ దేశ ప్రభుత్వం తెలిపింది. ప్రధాని మోదీ ఎక్స్ (X) వేదికగా బైడెన్ సర్కార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.


క్రీ.శ మొదటి శతాబ్దం నాటి ఆంటిక్విటీస్‌ కూడా ఉన్నాయి


భారత్‌- అమెరికా మధ్య సాంస్కృతిక పరమైన ఒప్పందంలో భాగంగా మన దేశం నుంచి యూఎస్‌ఏకు స్మగుల్ చేసిన దాదాపు 297 అత్యంత పురాతన వస్తువులు తిరిగి ఇచ్చేందుకు జో బైడెన్ సర్కారు సమ్మతి తెలిపింది. అక్రమ మార్గాల్లో ఆంటిక్విటీస్ తరలింపు కేవలం ఒక నేరమే కాక.. ఆయా దేశాల సాంస్కృతిక వారసత్వాన్ని దెబ్బతీసే ప్రక్రియగా పేర్కొన్న యూఎస్‌.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ సమస్యకు భారత్‌ తొలి బాధిత దేశంగా ఉందని తెలిపింది. అమెరికా తీసుకున్న నిర్ణయం.. భారత్‌ అమెరికా మధ్య సాంస్కృతిక సంబంధాలను మరింతగా బలోపేతం చేయడం సహా ఇటువంటి అక్రమ తరలింపుల ప్రక్రియను అడ్డుకోవడంలో సహకరిస్తుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో సహకరించిన ప్రెసిడెంట్ జో బైడెన్‌కు కృతజ్ఞతలు తెలిపిన మోదీ.. ఇది భారత దేశపు వారసత్వ, చారిత్రక సంపద మాత్రమే కాదని.. భారతీయ సంస్కృతి, అత్యంత ప్రాచీనమైన నాగరికతను తెలిపే చిహ్నాలుగా తెలిపారు.






ఈ 297 ఆంటిక్విటీస్ భారత్‌కు రానున్న తరుణంలో.. 2014 నుంచి భారత్‌కు తిరిగి తీసుకు వచ్చిన ఆంటిక్విటీస్ సంఖ్య 640కి చేరిందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వీటిలో ఒక్క అమెరికా నుంచే 578 తిరిగి భారత్‌కు వచ్చాయి. ప్రపంచంలో ఏ దేశమైన తిరిగి భారత్‌కు చెందిన వారసత్వ, సాంస్కృతిక చిహ్నాలుగా ఉన్న ఆంటిక్విటీస్‌ను తిరిగి భారత్‌కు అందచేసిన వాటిని లెక్కగడితే.. అమెరికా నుంచి వచ్చినవే అత్యధికం అని అధికారులు తెలిపారు. అమెరికా నుంచి వచ్చిన వాటిలో మధ్య భారతదేశపు సంస్కృతిని తెలిపే 10వ శతాబ్దపు నాటి అప్సర్ సాండ్‌ స్టోన్, 15వ శతాబ్దానికి చెందిన జైన్ తీర్థంకర్ రాగి విగ్రహం, తూర్పు భారతానికి చెందిన మూడో సెంచరీ నాటి టెర్రకోట్ట విగ్రహం, క్రీస్తు పూర్వం మొదటి శతాబ్దానికి చెందిన శిలా విగ్రహం అందులో ఉన్నాయి. వీటితో పాటు 17 వ శతాబ్దంకి చెందిన వినాయకుడి కాంస్య విగ్రహం, 15వ శతాబ్దం నాటి ఉత్తర భారతానికి చెందిన లార్డ్ బుద్ధ సాండ్‌ స్టోన్‌, 15వ శతాబ్దం నాటి కాంస్య విష్ణు విగ్రహాలు ఉన్నాయి.


2014లో మోదీ ప్రధాని అయిన తర్వాత భారత్‌కు తిరిగి వస్తున్న వారసత్వ సంపద


2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్‌కు చెందిన వారసత్వ సంపదను తిరిగి భారత్‌కు తీసుకురావడంలో నరేంద్రమోదీ తీవ్రమైన కృషి చేస్తున్నారు. 2021 యూఎస్ విజిట్ తర్వాత భారత్‌కు 12వ శతాబ్దం నాటి నటరాజ్ కాంస్య విగ్రహంతో పాటు 157 ఆంటిక్విటీస్‌ రాగా.. 2023 విజిట్ తర్వాత 105 ఆంటిక్విటీస్ వచ్చాయి. వీటితో పాటు యూకే నుంచి 16, ఆస్ట్రేలియా నుంచి 40 పురాతన వస్తువులు భారత్‌కు తిరిగి చేరుకున్నాయి. 2004 నుంచి 2013 మధ్య కాలంలో కేంద్రంలో యూపీఏ సర్కారు ఉండగా.. అప్పుడు కేవలం ఒకే ఒక్క పురాతన వస్తువు మాత్రమే భారత్‌కు తిరిగి రాగా.. మోదీ ప్రధాని అయ్యాక ప్రస్తుతం అమెరికా తిరిగి ఇస్తున్న 297తో కలిపి దాదాపు 700 వరకు భారత్‌కు చేరుకున్నాయి. అంతే కాకుండా ఈ ఏడాది జులైలో భారత్‌- అమెరికా మధ్య వారసత్వ సంపద ఇల్లీగల్ స్మగ్లింగ్ అరికట్టేందుకు ఒప్పందం కూడా జరిగింది.