Hyderabad News: హైదరాబాద్ నగరంలో హైడ్రా (Hyderabad Disaster Response and Assets Monitoring and Protection Agency) ఆధ్వర్యంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఆదివారం (సెప్టెంబర్ 22) కూకట్ పల్లి నల్లచెరువులోని ఆక్రమణలు అన్నీ హైడ్రా ఆధ్వర్యంలో కూల్చేస్తున్నారు. నల్ల చెరువు మొత్తం విస్తీర్ణం 27 ఎకరాలుగా ఉండేదని.. ఇందులో ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్), బఫర్ జోన్‌లో ఏడు ఎకరాలు ఆక్రమణకు గురైనట్లుగా హైడ్రా అధికారులు గుర్తించారు.
బఫర్ జోన్‌లోని నాలుగు ఎకరాల్లో దాదాపు 50కిపైగా పెద్ద పెద్ద భవనాలు, అపార్ట్ మెంట్లు నిర్మించినట్లుగా అధికారులు గుర్తించారు. ఎఫ్‌టీఎల్‌లోని మూడు ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లు ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. అయితే, భవనాల్లో నివాసం ఉంటున్నందున వాటి జోలుకు పోకుండా దాదాపు 16 షెడ్లను హైడ్రా కూల్చివేసింది. కూల్చివేతలు జరుగుతున్నందున అక్కడ భారీగా పోలీసులు మోహరించారు.
హైదరాబాద్ చెరువులు, కుంటల పరిరక్షణ కోసం ప్రయత్నిస్తున్న హైడ్రా తాజాగా సంగారెడ్డి జిల్లాపై ఫోకస్ చేసింది. దీనికి సంబంధించి జిల్లాలోని అమీన్ పూర్ మండలంలోని పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల్లో నిర్మించిన భవనాలు, ఆక్రమణలను హైడ్రా అధికారులు శనివారం పరిశీలన చేశారు. కిష్టారెడ్డిపేటలో దర్గా పక్కన ప్రభుత్వ స్థలంలో నిర్మించిన 3 భవనాలను అధికారులు చూశారు. పూర్తి సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని రెవెన్యూ సిబ్బందికి సూచించారు.
ఆ తర్వాత పటేల్ గూడలోని సర్వే నెంబర్ 12లో ఇళ్లను, ఐలాపూర్ గ్రామ పరిధిలోకి వచ్చే కోర్టు పరిధిలోని భూముల్లో అక్రమ నిర్మాణాలు జరిగినట్లు ఆరోపణలున్న భారీ అపార్ట్‌మెంట్లను, బీరంగూడ సంత పరిసరాల్లోని శంభునికుంటలోనూ ఆక్రమణలను హైడ్రా సిబ్బంది పరిశీలించారు. చెరువు విస్తీర్ణం, ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్), బఫర్ జోన్ల హద్దులను అధికారులు గుర్తించారు. పరిశీలన చేసిన తర్వాత మరుసటి రోజు ఉదయమే కూల్చివేత చర్యలను హైడ్రా అధికారులు మొదలుపెట్టారు.