అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేసినా ఓ సంచలనమే. అధికారంలో ఉన్నప్పుడు ట్రంప్.. ఎప్పుడు ఏం మాట్లాడతారోనని ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూసేవి. అందుకు కారణం ట్రంప్ చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. అయితే తాజాగా మరోసారి ట్రంప్ గురించి ఓ వార్త బయటకు వచ్చింది. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో శ్వేతసౌధానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పత్రాలను ఆయన చించేసినట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రచురించింది.
అదో అలవాటు
సాధారణంగా శ్వేతసౌధం సహా అధ్యక్షుడి అధికారిక సమావేశాలకు సంబంధించిన పత్రాలు, రికార్డులను 'ద నేషనల్ ఆర్కైవ్స్' భద్రపరుస్తుంది. అధ్యక్షుడు తన పదవీకాలం పూర్తి చేసుకొని శ్వేతసౌధం విడిచి వెళ్లేటప్పుడు ఈ పత్రాలను భద్రంగా వారికి అందించాలి. అయితే డొనాల్డ్ ట్రంప్ తన పదవీకాలం పూర్తయి వెళ్లే సమయంలో కొన్ని పత్రాలను తనతో పాటు తీసుకువెళ్లిపోయారని ఆర్కైవ్స్ డిపార్ట్‌మెంట్ ఆరోపించినట్లు ఈ కథనం పేర్కొంది.
కొన్నిసార్లు ట్రంప్ ఈ పత్రాలను చించేసి, టాయిలెట్‌లో వేసి ఫ్లష్ చేశారని ఈ నివేదిక వెల్లడించింది. ఇది ట్రంప్‌నకు ఉన్న ఓ అలవాటుగా పేర్కొంది. లేకుంటే ఫ్లోరిడాలో ఉన్న తన ఎస్టేట్‌కు వీటిని తరలిస్తారని తెలిపింది.
ప్రేమ లేఖలు
ట్రంప్ శ్వేతసౌధాన్ని వీడే సమయంలో తనతో పాటు తీసుకెళ్లిపోయిన 15 బాక్సుల డాక్యుమెంట్లను ఆయన ఫ్లోరిడా ఎస్టేట్ నుంచి రికవర్ చేసుకున్నట్లు ప్రభుత్వ అధికారిక కార్యాలయం వెల్లడించింది.
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో ట్రంప్ నిర్వహించిన అధికారిక సమావేశాల రికార్డులు కూడా ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా అప్పట్లో కిమ్ తనకు రాసిన లేఖలను ట్రంప్ ప్రేమలేఖలుగా ప్రస్తావించారు.. వీటిని కూడా ట్రంప్ తీసుకువెళ్లినట్లు సమాచారం.
బరాక్ ఒబామా తన పదవీకాలం పూర్తయి వెళ్లేటప్పుడు ట్రంప్ కోసం కార్యాలయంలో ఉంచిన లేఖను కూడా ఆయన తీసుకువెళ్లిపోయారట.
అన్నీ అబద్ధాలు
అయితే ఈ ఆరోపణలను ట్రంప్ ఖండించారు. ఈ వార్తలను ఫేక్ న్యూస్‌గా అభివర్ణించారు.
[quote author=డొనాల్డ్ ట్రంప్, అమెరికా మాజీ అధ్యక్షుడు]నారా (నేషనల్ ఆర్కైవ్స్)కు నాకు మధ్య ఉన్న సంబంధాలను చెడగొట్టేందుకు ఈ వార్తలు ప్రచురించారు. ఇది ఫేక్ న్యూస్. వీళ్లు చెప్పినదానికి విరుద్ధంగా నిజాలు ఉన్నాయి. నారాతో పనిచేయడం నాకు చాలా గౌరవప్రదం. ట్రంప్ లెగసీని ముందుకు తీసుకువెళ్లడంలో వారి పాత్ర ఎనలేనిది. [/quote
1978 ప్రెసిడెన్షియల్ రికార్డ్స్ చట్టం ప్రకారం.. అమెరికా అధ్యక్షులు అందరూ వారి పదవీకాలం పూర్తయిన తర్వాత ఈమెయిల్స్, లేఖలు సహా ఇతర అధికారిక పత్రాలను నేషనల్ ఆర్కైవ్స్‌కు బదిలీ చేయాలి.