COVID-19 Testing:


నిబంధన ఎత్తివేత..


చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు కొవిడ్ టెస్ట్‌లు చేయాలన్న నిబంధనను ఎత్తివేయాలని చూస్తోంది అమెరికా. చైనాలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడం, మరణాలు పెద్దగా నమోదు కాకపోవడం లాంటి పరిణామాలను గమనించిన బైడెన్ యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు Associated Press రిపోర్ట్ వెల్లడించింది. గతేడాది డిసెంబర్ 28న అమెరికా చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు కొవిడ్ పరీక్షలు తప్పనిసరిగా చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది జనవరి 5వ తేదీ నుంచి ఇది అమల్లోకి తెచ్చింది. అప్పటికి చైనాలో కొవిడ్ కేసులు తీవ్రంగా పెరిగాయి. హాస్పిటల్స్‌లో చోటు లేక బాధితులు పాట్లు పడ్డారు. మృతుల సంఖ్య కూడా దారుణంగా పెరిగింది. శవాలను దహనం చేసేందుకూ అవకాశం లేక రోజుల తరబడి వాటిని అలాగే ఉంచారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంత జరుగుతున్నా...చైనా మాత్రం కొవిడ్ బాధితుల లెక్కలు ప్రపంచానికి వెల్లడించలేదు. దీనిపై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఆ సమయంలోనే అమెరికా చైనా ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. అమెరికాలోని విమానాశ్రయాల్లో నిఘా పెట్టారు. చైనా నుంచి వచ్చే ప్రతి ప్రయాణికుడికీ కరోనా టెస్ట్ చేశారు. ఫ్లైట్‌లలోని మల మూత్రాలనూ పరీక్షించారు. Genomic Surveillance Programలో భాగంగా...చైనాతో సహా 30 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించింది అమెరికా యంత్రాంగం. 


జనవరిలో అమలు చేసిన నిబంధనల ప్రకారం చైనా నుంచి నేరుగా వచ్చినా, వయా చైనా నుంచి వచ్చినా టెస్ట్‌లు తప్పనిసరి చేశారు. 
అయితే...ఇప్పటికీ అమెరికా..చైనాపై విమర్శలు చేస్తూనే ఉంది. కొవిడ్ లెక్కల విషయంలో పారదర్శకంగా ఉండడం లేదంటూ మండి పడుతోంది. వేరియంట్‌లకు సంబంధించిన సమాచారాన్నీ అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 


మనిషికి బర్డ్‌ఫ్లూ..


చైనా పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది వింత వింత రోగాలే. ఎన్నో వైరస్‌లు అక్కడి నుంచే పుట్టాయన్న ఆరోపణలు ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాయి. కరోనా కూడా చైనా ల్యాబ్‌ నుంచే విస్తరించిందన్న వాదన ఉంది. అక్కడి ప్రజల ఆహారపు అలవాట్లు ఇలాంటి కొత్త వైరస్‌లు వ్యాప్తి చెందేందుకు ఆస్కారమిస్తుంటాయి. ఇప్పుడు అదే తరహాలో అక్కడ బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి చెందుతోంది. అయితే బర్డ్ ఫ్లూ అంటే కేవలం కోళ్లకే వస్తుందనుకుంటాం. కానీ చైనాలో తొలిసారి ఓ మనిషికి H5N1 Bird Flu సోకింది. ఇదే విషయాన్ని చైనా అధికారికంగా వెల్లడించింది. తూర్పు చైనాలోని ఓ మహిళకు ఈ ఫ్లూ సోకినట్టు ప్రకటించింది. ఆ మహిళ ఓ పౌల్ట్రీకి వెళ్లిందని అప్పటి నుంచి తాను అస్వస్థకు గురైందని వివరించింది. జనవరి 31న ఫ్లూ లక్షణాలు కనిపించిన కారణంగా టెస్ట్ చేశారు. చివరకు ఫ్లూ సోకినట్టు నిర్ధరణైంది. అంతకు ముందు కంబోడియాలోనూ 11 ఏళ్ల బాలికకు ఈ ఫ్లూ సోకి ప్రాణాలు కోల్పోయింది. ఇప్పటికే ఆ దేశంలో రెండు కేసులు నమోదయ్యాయి. 49 ఏళ్ల మహిళకూ  H5N1 Bird Flu సోకినట్టు కంబోడియా ఆరోగ్య శాఖ వెల్లడించింది. దాదాపు 9 ఏళ్లుగా ఈ వైరస్‌ అప్పుడప్పుడూ ఆందోళనకు గురి చేస్తున్నా మనుషులకు సోకింది లేదు. కానీ ఈసారి మాత్రం వైరస్ తీవ్రత పెరిగినట్టు చెబుతున్నారు శాస్త్రవేత్తలు. 


Also Read: Manish Sisodia: సిసోడియాను క్రిమినల్స్‌తో కలిపి ఉంచారు! కోర్టు చెప్పినా వినడం లేదు - ఆప్ ఆరోపణలు