Manish Sisodia in Tihar Jail:


కోర్టు అనుమతి..


ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన మనీశ్ సిసోడియాను తీహార్ జైలుకు తరలించారు అధికారులు. అయితే...సిసోడియాను విపాసన సెల్‌లో కాకుండా ఇతర నేరస్థులతో కలిపి ఉంచారని ఆరోపిస్తోంది ఆప్. సిసోడియాను విపాసన సెల్‌లో ఉంచాలన్న తమ అభ్యర్థనను కోర్టు అంగీకరించినా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శిస్తోంది. ఆప్ జాతీయ ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ ఈ మేరకు విమర్శలు చేశారు. 


"తిహర్‌ జైల్లో విపాసన సెల్‌లో సిసోడియాను ఉంచాలని మేం కోర్టుకి రిక్వెస్ట్ పెట్టుకున్నాం. అందుకు కోర్టు అంగీకరించింది కూడా. కానీ సిసోడియాను ఇతర నేరస్థులతో కలిపి జైల్ నంబర్1లో ఉంచారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై సమాధానం ఇవ్వాలి" 


-సౌరభ్ భరద్వాజ్, ఆప్ జాతీయ ప్రతినిధి






భగవద్గీత తీసుకెళ్లొచ్చు.. 


అయితే అధికారులు మాత్రం ఇందులో ఎలాంటి పక్షపాతం లేదని చెబుతున్నారు. సీనియర్ సిటిజన్స్‌ని ఉంచే సెల్‌లోనే సిసోడియాను ఉంచామని వివరించారు. ఇదే సమయంలో కోర్టు సిసోడియాకు కొన్ని అనుమతులు ఇచ్చింది. భగవద్గీత, అద్దాలు, మందులు తీసుకెళ్లేందుకు అంగీకరించింది. మెడిటేషన్ చేసుకునేందుకూ తిహార్ జైలు అధికారులు అనుమతినిచ్చారు.


14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్


ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం  మనీష్‌ సిసోడియా కు కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. ఆయనను పోలీసులు  తీహార్ జైలుకు తరలించారు.  ఈ నెల 20 వరకు రిమాండ్ విధింారు అయితే  10వ తేదీన సిసోడియా బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో సీబీఐ 7 రోజుల పాటు ప్రశ్నించింది. అయితే సిసోడియా సహకరించలేదని సీబీఐ వర్గాలుచెబుతున్నాయి.  ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో సిసోడియా కీలక పాత్ర పోషించాడని రిమాండ్ రిపోర్టులో  సీబీఐ ఆరోపించింది. ''కేవలం కొంత మంది లిక్కర్ వ్యాపారులకు లబ్ధి కలిగించేందుకే ఎక్సైజ్ పాలసీని సిసోడియా మార్పుచేశారు. సౌత్ ఇండియా బేస్డ్ లిక్కర్ వ్యాపారులు, రాజకీయనేతల అధీనంలోని సౌత్ గ్రూప్ ద్వారా ఈ కేసులో నిందితుడైన విజయ్ నాయర్ రూ.100 కోట్లు వసూలు చేశాడు. ఈ పాలసీ ద్వారా సౌత్ గ్రూప్‌కే ఎక్కువ లబ్ధి చేకూరుతుంది. హవాలా మార్గాల ద్వారా రూ.100 కోట్ల చెల్లింపులు జరిగాయి. వాటిని మేము కనిపెట్టాం. 2021 సెప్టెంబర్, అక్టోబర్ మధ్య సిసోడియా 14 సెల్‌ఫోన్లు, నాలుగు సిమ్ కార్డులు మార్చారు. సాక్ష్యాలను ధ్వంసం చేయడమే సెల్‌ఫోన్లు మార్చడం వెనుక ప్రధాన ఉద్దేశం. ఈ మొబైల్ ఫోన్లను సిసోడియా సెక్రటరీ ధర్మేంద్ర శర్మ సమకూర్చారు. ఇందుకు సంబంధించి ఆయన స్టేట్‌మెంట్ కూడా తీసుకున్నాం'' అని సీబీఐ రిమాండ్  రిపోర్టులో తెలిపింది.       


Also Read: Kavitha Letter to ED: ఈడీకి ఎమ్మెల్సీ కవిత లేఖ, ఆరోజు విచారణకు రాలేనని రిక్వెస్ట్! ఈడీ స్పందనపై ఉత్కంఠ