కర్ణాటకలో మొదలైన 'హిజాబ్' వివాదం.. తీవ్రరూపం దాల్చింది. శాంతి భద్రతలను దెబ్బతీసే రీతిలో ఈ వివాదం ముదరడం ఆందోళన కలిగిస్తోంది. హిజాబ్‌కు వ్యతిరేకంగా కాషాయ కండువాలు ధరించిన విద్యార్థులు ర్యాలీలు నిర్వహించడంతో వ్యవహారం మరింత రాజుకుంది. చివరికి ఇది కర్ణాటక హైకోర్టును తాకింది.
ఉడుపి ప్రీ-యూనివర్సిటీకి చెందిన విద్యార్థినులు.. తాము హిజాబ్ ధరించి క్లాసులకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఏంటి వివాదం?
కర్ణాటకలోని విద్యాసంస్థల్లో ముస్లిం బాలికలు హిజాబ్స్ ధరించి తరగతి గదులకు హాజరవుతుండడంపై గత నెలరోజులుగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి హిందూ సంఘాలు. నెల రోజుల నుంచి ఉడుపి, చిక్‌మంగళూరులో వాతావరణం ఆందోళనగా ఉంది. హిజాబ్స్ ధరించిన బాలికలను స్కూళ్లకు అనుమతించకపోవడంతో ప్రతిగా అది ధరించడం తమ హక్కు అంటూ నిరసన వ్యక్తం చేశారు విద్యార్థులు.
పోటీగా కాషాయం..
మరోవైపు హిజాబ్‌కు వ్యతిరేకంగా కాషాయపు కండువాలు ధరించిన విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. శనివారం ఉడుపి కుండాపూర్‌లో కొందరు బాలబాలికలు కాషాయపు కండువాలు ధరించి 'జై శ్రీరామ్' నినాదాలతో ర్యాలీలు చేసిన వీడియోలు ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి.
దీంతో కర్ణాటక సర్కార్ శనివారం కీలక ఉత్తర్వులు జారీ చేసేంది. శాంతి భద్రతలను దెబ్బతీసే రీతిలో విద్యాసంస్థల్లో విద్యార్థులు దుస్తుల్ని ధరించడానికి వీల్లేదంటూ తాజా ఉత్తర్వుల్లో నిషేధాజ‍్క్షలు జారీ చేసింది.
ఎంపిక చేసిన డ్రెస్ కోడ్
కర్ణాటక విద్యా చట్టం-1983లోని సెక్షన్ 133 (2) ప్రకారం విద్యార్థులు ఒకే తరహా దుస్తులను తప్పనిసరిగా ధరించాలని పేర్కొంది. ప్రైవేట్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ తమకు నచ్చిన యూనిఫామ్‌ను ఎంచుకోవచ్చు అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. విద్యార్థులు అధికారులు ఎంపిక చేసిన డ్రెస్ కోడ్‌నే అనుసరించాలని స్పష్టం చేసింది.
అడ్మినిస్ట్రేటివ్ కమిటీ యూనిఫాంను ఎంపిక చేయని సందర్భంలో సమానత్వం, సమగ్రత, ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగించే రీతిలో దుస్తులను ధరించకూడదంటూ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.
Also Read: BJP Manifesto UP Election: యూపీ మేనిఫెస్టో విడుదల చేసిన భాజపా.. యువత, రైతులు, మహిళలపై వరాల జల్లు