మెలోడీ క్వీన్ లతా మంగేష్కర్ ఆదివారం నాడు కన్నుమూశారు. కొన్ని రోజులు క్రితం అనారోగ్యంతో హాస్పిటల్ లో జాయిన్ అయిన ఆమె ఆరోగ్యం క్షీణించి ఫిబ్రవరి 6న మరణించారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, ప్రముఖులు ఆమెకి భారీ ఎత్తున నివాళులు అర్పించారు. బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ సైతం ఆమె పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఆర్యన్ ఖాన్ పోలీస్ కేస్ ఇష్యూ తరువాత తొలిసారి షారుఖ్ మీడియా ముందుకు వచ్చారు. 


లతా మంగేష్కర్ కి నివాళులు అర్పించే సమయంలో తన మాస్క్ ను కిందకు దించి ఆమె పాదాల దగ్గర ఊదాడు షారుఖ్. ముస్లిం కమ్యూనిటీలో ఇదో రకమైన ప్రార్ధన. దీన్ని తప్పుగా అర్ధం చేసుకున్న కొందరు షారుఖ్.. లతా మంగేష్కర్ పాదాల వద్ద ఉమ్మేసినట్లు కామెంట్స్ చేస్తున్నారు. షారుఖ్ ప్రవర్తనను తప్పుబడుతూ.. అతడిని ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయంలో షారుఖ్ అభిమానులు అతడికి మద్దతుగా నిలిచారు. 


తాజాగా నటి ఊర్మిళ కూడా ఈ విషయంపై స్పందించింది. ఒక సమాజంలో జీవిస్తున్న మనం ప్రార్ధన చేయడాన్ని ఉమ్మివేసినట్లుగా భావించినంతగా దిగజారిపోయామని మండిపడింది. వివిధ అంతర్జాతీయ వేదికలపై మన దేశం తరఫున ప్రాతినిధ్యం వహించిన నటుడి గురించి ఇలా మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయింది. పాలిటిక్స్ ఇంత నీచస్థాయికి దిగజారడం చాలా బాధగా ఉందంటూ చెప్పుకొచ్చింది. లతా మంగేష్కర్ మరణం తనను ఎంతో బాధించిందని.. సోషల్ మీడియా వేదికగా ఆమెకి నివాళులు అర్పించింది ఊర్మిళ.