Uri attacks:
యురిలో ఉగ్రవాదుల భీకర దాడి..
2016 సెప్టెంబర్ 18. భారత దేశ చరిత్రలో ఇదో చీకటి రోజు. యురిలోని ఇండియన్ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌పై జైషే మహమ్మద్ ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో 19 మంది భారత సైనికులు అమరులయ్యారు. దాదాపు 30 మంది వరకూ గాయపడ్డారు. రెండు దశాబ్దాల్లో కశ్మీర్‌లో భారత సైనికులపై జరిగిన అత్యంత దారుణమైన దాడి ఇదే. యురి టౌన్‌లోని మిలిటరీ క్యాంప్‌ను దాటుకుని వచ్చి మరీ ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. గ్రైనేడ్ అటాక్ ద్వారా సైనికుల ప్రాణాలు తీశారు. నిజానికి వాళ్లు ఫ్యుయెల్ డిపోట్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి చేయాలని భావించారు. అయితే..ఆ డిపో పక్కనే భారత సైనికులు టెంట్‌లు వేసుకుని నిద్రిస్తున్నారు. అనుకున్నట్టుగానే ఫ్యుయెల్ డిపోపై గ్రైనేట్ దాడి చేశారు ముష్కరులు. ఒక్కసారిగా మంటలు చెలరేగి పక్కనే ఉన్న టెంట్‌లకు అంటుకున్నాయి. అందులో నిద్రిస్తున్న సైనికులు
కాలి బూడిదయ్యారు. ఓ నలుగురు సైనికులు అక్కడి నుంచి పారిపోవాలని చూసినప్పటికీ...ఉగ్రవాదులు వాళ్లను పట్టుకుని హతమార్చారు. పాకిస్థాన్‌కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఉగ్రవాదులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ప్లానింగ్ నుంచి ఎగ్జిక్యూషన్ వరకూ అంతా ఆ సంస్థదే. అప్పుడే కశ్మీర్ లోయలో హింస చెలరేగింది. 2015 నుంచే భారత్ సైనికులు లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు.
తిప్పికొట్టిన భారత సైన్యం..
2015 జులైలో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. బస్, పోలీస్ స్టేషన్‌లను టార్గెట్‌గా చేసుకుని ఈదాడి చేశారు. 2016లో పఠాన్‌కోట్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుని నలుగురు ఉగ్రవాదులు దాడి చేశారు. ఇది కూడా జైషే మహమ్మద్ ఉగ్రసంస్థ పనేనని భారత సైన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. 2016 జులై 8వ తేదీ నుంచి జమ్ముకశ్మీర్‌లో అశాంతి కొనసాగుతూనే ఉంది. ఉగ్రవాద నాయకుడు బుర్హాన్ వనీని హతమార్చినప్పటి నుంచి భారత సైనికులపై ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. ఈ ఉగ్రవాద నాయకుడిన చంపిన సమయంలో భారత్‌కు వ్యతిరేకంగా కశ్మీర్‌లో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. అయితే...యురి ఘటన తరవాత విచారణను వేగవంతం చేసింది భారత్. నలుగురు ఉగ్రవాదులు AK-47 తుపాకులతో వచ్చి గ్రైనేడ్ లాంఛర్స్‌తో దాడులు చేసినట్టు తేలింది. 50 కన్నా ఎక్కువ మొత్తంలో గ్రైనేడ్‌లు క్యారీ చేశారని వెల్లడైంది. 200 లీటర్ల కన్నా ఎక్కువ ఫ్యుయెల్ ఉన్న డిపోపై దాడి జరగటం వల్ల మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ఈ దాడికి దిగారు నలుగురు ఉగ్రవాదులు. అయితే...భారత సైన్యం వారితో వీరోచితంగా పోరాడి, నలుగురు ముష్కరులను హతమార్చింది. ఇది జరిగిన పది రోజుల తరవాత భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. ఈ దాడిలో భారీ సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనతో ఒక్కసారిగా సరిహద్దులోని వాతావరణం గంభీరంగా మారింది. ఉగ్రవాదులు LOCని దాటుకుని పదేపదే భారత భూభాగంలోకి చొచ్చుకుని రావటాన్ని ఇలా తిప్పి కొట్టింది భారత సైన్యం. మొత్తంగా...యురి ఘటన రెండు దేశాల మధ్య వైరాన్ని ఇంకా పెంచటమే కాకుండా...సైన్యం బలం నిరూపించుకునేందుకు అవకాశం లభించింది.
Also Read: J&K: జమ్ముకశ్మీర్ భూభాగంలోకి డ్రోన్‌ను పంపిన పాక్? నిఘా పెంచిన భద్రతా దళాలు