సాధారణంగా మేకలు, గొర్రెలు ఒక్కోదేశంలో ఒక్కోలా ఉంటాయి. ఆయా వాతావరణ పరిస్థితులను బట్టి ఎత్తు, పొడవు, బరువులో తేడాలు కనిపిస్తాయి. చల్లటి దేశాల్లోని గొర్రెలు, మేకులు ఒళ్లంతా దట్టమైన వెంట్రుకలను కలిగి ఉంటాయి. ఎడారి దేశాల్లో చాలా బక్కగా ఎత్తుగా కనిపిస్తాయి. పశువులు సైతం ఇంచుమించు ఇలాంటి శరీర ఆకృతితోనే కనిపిస్తాయి. కానీ, పాకిస్తాన్ లో ఓ మేక అత్యంత అరుదైన లక్షణాలను కలిగి ఉంది. అరుదైన లక్షణాలు కలిగిన ఈ మేకను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కించాలంటూ దాని యజమాని దరఖాస్తు చేసుకున్నాడు. ఇంతకీ ఆ మేక విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మామూలుగా అయితే మేక చెవులు ఎంత పొడవు ఉంటాయి? 5 ఇంచులు ఉంటాయి. లేదంటే ఇంకో ఇంచు ఎక్కువగా ఉంటుంది. కానీ పాకిస్తాన్ కు చెందిన ఓ మేకకు ఏకంగా రెండు అడుగుల పొడవైన చెవులున్నాయి. ఆ చెవులు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. మున్ముందు ఇంకా పొడవుగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సదరు మేక యజమాని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులను సంప్రదించాడు.
ఈ మేక యజమాని హసన్ నరేజో తాజాగా పలు విషయాలు వెల్లడించాడు. “జూన్ 4న, నా మేక కరాచీలో జన్మనిచ్చింది. నేను దానికి సింబా పాకిస్తానీ అని పేరు పెట్టాను. సింబా పాకిస్థానీ చెవులు పుట్టినప్పుడు 48 సెంటీ మీటర్లు ఉన్నాయి. అప్పట్లోనే దీని చెవులపై అనేక చర్చలు జరిగాయి. ఇంటర్నెట్ లోనూ సంచలనంగా మారింది. ప్రస్తుతం, సింబా వయసు 85 రోజులు. దీని చెవులు ఇప్పటికే 2 ఫీట్లకు పైగా పొడవున్నాయి. ప్రస్తుతం నేను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కోసం దరఖాస్తు చేసాను’’ అని హసన్ తెలిపాడు.
అటు ఇంత పొడవు చెవులున్న మేకను ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా లేదని ఆయన వెల్లడించారు. “ఈ మేక చెవులు నకిలీవని, మేకకు కొన్ని హార్మోన్లను ఎక్కిండం మూలగా ఇలా పెరిగాయని కొంత మంది అంటున్నారు. కానీ, ఆ ఆరోపణలన్నీ అవాస్తవం. దీని చెవులు సహజంగా పెరుగుతున్నాయి. ఇది పాకిస్తాన్ కు చెందిన జాతి మేక. ఇలాంటి మేక ఈ రోజుల్లో చాలా అరుదుగా ఉంటుంది’’ అన్నాడు.
ప్రస్తుతం ఈ మేకకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నది. నెటిజన్లు ఈ మేక చెవులు చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ మేక పెద్ద చెవులను చూస్తుంటే డంబో అనే యానిమేషన్ చిత్రం గుర్తుకొస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీన్ని.. చెవులు సరికొత్త స్థాయికి తీసుకెళ్తాయని మరో నెటిజన్ అభిప్రాయ పడ్డాడు. ఈ మేక గురించి వస్తున్న గాసిప్స్ నేను నమ్మడం లేదు. ఇవి నిజమైన చెవులు.. అని మరో వ్యక్తి అభిప్రాయపడ్డాడు. త్వరలో ఈ మేకకు సంబంధించిన చెవులు పరిశీలించేందుకు గిన్నీస్ బుక్ ప్రతినిధులు రాబోతున్నట్లు తెలుస్తున్నది.